ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు, పరీక్షల గరిష్ఠ ధరలను వైద్యారోగ్య శాఖ ఖరారు చేసింది. కొవిడ్ చికిత్సల ఛార్జీలపై జీవో 40ను జారీ చేసింది. సాధారణ వార్డులో ఐసోలేషన్, పరీక్షలకు రోజుకు గరిష్ఠంగా 4వేల రూపాయలుగా నిర్ణయించింది.
కరోనా చికిత్సకు ఐసీయూ వార్డు(ICU Ward)లో రోజుకు గరిష్ఠంగా 7,500లుగా ప్రకటించింది. వెంటిలేటర్‌తో కూడిన ఐసీయూ గదికి రోజుకు గరిష్ఠంగా 9వేలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. పీపీఈ కిట్ ధర(PPE KIT COST) రూ.273 మించరాదని.. హెచ్ఆర్సీటీ రూ.1995, డిజిటల్ ఎక్స్ రే రూ.1300లుగా ఖరారు చేసింది. ఐఎల్6 ధర 1300, డీ డైమర్ పరీక్ష 300 ఛార్జి చేయాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది.
సీఆర్పీ 500, ప్రొకాల్ సీతోసిన్ 1400, ఫెరిటిన్ 400, ఎల్డీహెచ్ 140 రూపాయలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సాధారణ అంబులెన్సుకు కనీస ఛార్జి రెండు వేలుగా నిర్ణయించిన అధికారులు.. కిలోమీటరుకి 75 రూపాయలు మాత్రమే తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆక్సిజన్ అంబులెన్సుకు కనీస ఛార్జి రూ.3వేలుగా నిర్ణయించగా.. కిలోమీటరుకు 125 రూపాయలు వసూలు చేసేలా జీవోలో పొందుపరిచారు.