ఇంటర్‌మీడియట్ చివరి పరీక్షలను ఏప్రిల్ నెలాఖరున, పదో తరగతి పరీక్షలను మే నెలలోను నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ అధికారులకు ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ఏప్రిల్ నెలాఖరులో పదో తరగతి పరీక్షలు మొదలైతే అవి పూర్తయ్యేందుకు 15 రోజులు పడుతుంది. హిందీ తప్ప మిగిలిన సబ్జెక్టుల్లో రెండేసి పేపర్లుంటాయి. అంటే అవి మే 10 నాటికి పూర్తవుతాయి. ఆ వెంటనే ఇంటర్ పరీక్షలు ప్రారంభిస్తారు. ఇంతకు ముందు ఇంటర్‌బోర్డు ప్రకటించిన విద్యాక్యాలెండర్ ప్రకారం మార్చి 24 నుంచి ఇంటర్ పరీక్షలు మొదలు కావాలి. తాజాగా వాటిని మే నెలలో ఆరంభించాలని చిత్రారామచంద్రన్ ఆదేశించినట్లు తెలిసింది. డిసెంబరు 1 నుంచి పాఠశాలలు, కళాశాలలు తెరిస్తే అయిదు నెలలపాటు విద్యార్థులకు తరగతి గది బోధన అందుతుందన్నది ప్రభుత్వ ఉద్దేశం.
పది విద్యార్థులకు వెసులుబాటు
ఇంటర్ ప్రశ్నపత్రాల విధానంలో మార్పులు చేయరాదని విద్యాశాఖ నిర్ణయించింది. అందులో సడలింపులు ఇస్తే విద్యార్థులు జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రవేశపరీక్షల్లో రాణించడం కష్టమవుతుందని అధికారుల భావన. అదే సమయంలో పదో తరగతి విద్యార్థులకు ప్రశ్నపత్రాల్లో ఇప్పటివరకు ఉన్న దాని కంటే ఐచ్ఛికాలు(చాయిస్) పెంచనున్నారు. పదో తరగతిలో ఒక్కో పేపర్‌కు మొత్తం 40 మార్కులతో పరీక్ష నిర్వహిస్తారు. ఉదాహరణకు ఇప్పటివరకు సాంఘిక శాస్త్రం పేపర్-1లోని పార్ట్-ఏ 35 మార్కులకు, పార్ట్-బి మరో 5 మార్కులకు పరీక్ష జరుపుతున్నారు. సెక్షన్-1లో ఏడు, సెక్షన్-2లో ఆరు ప్రశ్నలిస్తే అన్నింటికీ సమాధానాలు ఇవ్వాలి. సెక్షన్-3లో మాత్రం నాలుగు మార్కుల ప్రశ్నలు 4 రాయాలి. ఒక్కో దానికి ఏ లేదా బీ ప్రశ్న ఇస్తే ఏదొకటి ఎంచుకుని రాయాలి. పార్ట్-బీలో అయిదు మార్కులకు బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు(ఆబ్జెక్టివ్ టైపు) ఇస్తారు. ఈసారి ఆ సంఖ్యను కూడా పెంచాలని భావిస్తున్నారు.
బడులు తెరిచాకే ఎఫ్‌ఏ పరీక్షలు
సెప్టెంబరు 1 నుంచి టీవీల ద్వారా పాఠాలు ప్రసారమవుతున్నా ఇప్పటివరకు ఫార్మేటివ్ అసెస్‌మెంట్(ఎఫ్‌ఏ) పరీక్షలు జరపలేదు. బడులను తెరిచాక కొద్ది రోజులు తరగతి గది బోధన తర్వాతే పరీక్షలకు శ్రీకారం చుడతామని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు.
- ఇదీ చదవండి: అసెంబ్లీలో పేద ప్రజల గొంతుకనవుతా: రఘునందన్