రాష్ట్రంలో కరోనా అనుమానితులు పెరుగుతుండంటం వల్ల ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. దిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్‌లో తబ్లీగీ జమాత్‌కు హాజరైన వారిలో వైరస్ అనుమానిత లక్షణాలుంటే గాంధీ ఆస్పత్రి, క్వారంటైన్లకు తరలించాలని పోలీస్ శాఖకు ఆదేశించింది. కొవిడ్-19 లక్షణాలున్న వారు ఎక్కడున్నా క్వారంటైన్లకు తరలించాలని సూచించింది. తెలంగాణ నుంచి వెయ్యి 30 మంది హజ్రత్‌కు వెళ్లినట్లు నిఘా వర్గాలు మంగళవారం తెలిపాయి. ఈ వివరాల ఆధారంగా పోలీసులు, ప్రత్యేక బృందాలు చర్యలు చేపట్టాయి. బుధవారం రాత్రి వరకూ జమాత్‌కు హాజరైన వారిలో 80 శాతం మందిని గాంధీ ఆస్పత్రి, ప్రభుత్వ క్వారంటైన్లకు తరలించారు. మిగిలిన వారి వివరాలు సరిగా తెలియకపోవడం వల్ల మత పెద్దల సహకారంతో వారిని గుర్తిస్తున్నట్లు సమాచారం.
రాష్ట్రవ్యాప్తంగా దిల్లీకి వెళ్లిన 1030 మందిలో 603 మంది హైదరాబాద్ గ్రేటర్ పరిధిలోనే ఉండడం వల్ల డీజీపీ మహేందర్ రెడ్డి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు, పలు జోన్ల డీసీపీలతో చర్చించారు. జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఈ 603 మంది హైదరాబాద్ వచ్చాక ఎంతమందిని కలిశారు? ఏం చేశారు? అన్న వివరాలను పక్కాగా సేకరించాలని ఆదేశించారు. చిరునామాలు లభించని వారి వివరాలను వేగంగా కనుక్కొని.. వారికి వెంటనే వైద్యపరీక్షలు చేయించాలని సూచించారు.
మరోవైపు హైదరాబాద్ పోలీసులు ఇక్కడ ఉంటున్న ఇతర జిల్లాల వాసులను గుర్తిస్తున్నారు. ఒక జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఓ సీఐ తబ్లీగీ జమాత్ ప్రార్థనలకు వెళ్లి అనారోగ్యపాలై.. పాతబస్తీలోని తన ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉంటున్నారని తెలుసుకున్నారు. అతన్ని క్వారంటైన్‌కు తరలించి కుటుంబ సభ్యులను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. 24 గంటల్లోపు అందరి వివరాలను సేకరించి వైద్యపరీక్షలు చేయించేందుకు పోలీసులు కార్యచరణ రూపొందించారు.
ఇదీ చూడండి: ప్రైవేట్ ఆస్పత్రుల సేవలను ఏ విధంగా వాడుతున్నారు: హైకోర్టు