Delay in Recruitment of Telangana Horticulture : రాష్ట్రంలో ఉద్యాన విద్యార్థులు పోరుబాట పట్టారు. ధీర్ఘకాలంగా ఉద్యాన విస్తరణ అధికారుల పోస్టుల భర్తీలో జాప్యాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని విద్యార్థులు తరగతులు బహిష్కరించి ధర్నాకు దిగారు. రెండుదశాబ్ధాలుగా హెచ్‌ఈవో పోస్టులు భర్తీ చేయకుండా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆక్షేపించారు.
Delay in Telangana Horticulture Posts : గతంలో వ్యవసాయశాఖ నుంచి డిప్యూటేషన్‌పై ఉద్యానశాఖలో హెచ్ఈవోలుగా చేరి పదవీ విరమణ తర్వాత కొత్తగా నియమకాలు చేపట్టిన దాఖలాలు లేవు. వ్యవసాయశాఖ తరహాలో ప్రతి 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌కి ఏఈవోని నియమించినట్లే ఉద్యానశాఖలోనూ ప్రతి 5 వేల ఎకరాలకు ఒక హెచ్‌ఈవో చొప్పున నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.
వ్యవసాయశాఖ తరహాలో దామాషా ప్రకారం చూసినా 13 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పండ్లు, పూలు, కూరగాయలు, ఔషధ, సుగంధ పంటలు సాగవుతున్నాయి. ఆయా పంటల సాగు విస్తీర్ణం దృష్ట్యా 230పైగా హెచ్‌ఈవో పోస్టుల భర్తీ తప్పనిసరి. రాబోయే మూడేళ్లల్లో 20 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పామాయిల్ సాగులోకి తేవాలని ప్రభుత్వం, ఉద్యానశాఖ నిర్ణయించినందున 400 మంది హెచ్ఈవోల అవసరం ఉంటుంది.
దాదాపు 650కి పైగా హెచ్‌ఈవో పోస్టులు భర్తీ చేయాల్సి ఉన్నా ఇంకా టీఎస్పీఎస్సీలో కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీ పేరు నమోదు కాలేదని పట్టభద్రులు వాపోతున్నారు. రెండురోజులుగా తరగతులు బహిష్కరించి విద్యార్థులు ఆందోళనకు దిగడంతో కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం స్పందించింది. ఆ అంశం వర్సిటీ పరిధిలో లేనందున ఓ విద్యార్థి ప్రతినిధి బృందాన్ని వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు వద్దకు తీసుకెళ్లి సమస్య తీవ్రత వివరించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ప్రభుత్వం ఇటీవల వివిధ శాఖల్లో ఖాళీల భర్తీ ప్రక్రియ చేపట్టిన తరుణంలో టీఎస్పీస్సీతో ఉద్యాన వర్సిటీ సంప్రదింపులు చేస్తోంది. కొత్తగా హెచ్‌ఈవో పోస్టులు సృష్టించడం ద్వారా తొలి నోటిఫికేషన్ విడుదల చేయించేందుకు చర్యలు చేపట్టింది.
ఇవీ చదవండి: