Delay in GHMC Parking Complexes Works: గ్రేటర్ హైదరాబాద్లోని మూడు జిల్లాల పరిధిలో రిజిస్టరైన వాహనాల సంఖ్య 65 లక్షలు దాటింది. వీటికితోడు వేలాది కొత్త వాహనాలు ప్రతిరోజూ రోడ్డెక్కుతున్నాయి. అయితే... ఈ సంఖ్యకు అనుగుణంగా రోడ్ల విస్తీర్ణం, రహదారుల అభివృద్ధి మాత్రం జరగడం లేదు. ముఖ్యంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, కూడళ్లు, పర్యాటక ప్రదేశాలు సహా రద్దీ ప్రాంతాల్లో వాహనాలు నిలిపేందుకు చోటు కనిపించని పరిస్థితి. ఈ సమస్య పరిష్కారం కోసం ఏడేళ్ల క్రితం నగర వ్యాప్తంగా 40చోట్ల మల్టీలెవల్ పార్కింగ్ కాంప్లెక్సులు నిర్మించాలని ప్రభుత్వం ప్రకటించింది. అయితే... ఇప్పటివరకు వాటిలో ఒక్కదాని నిర్మాణం కూడా పూర్తి కాలేదు. హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ఆధ్వర్యంలో నాలుగేళ్ల క్రితం నాంపల్లిలో మొదలైన కాంప్లెక్సు నిర్మాణం నత్తనడకన సాగుతోంది.
హైదరాబాద్లో మల్టీలెవల్ పార్కింగ్ కాంప్లెక్సుల నిర్మాణంపై 2015 నుంచి జీహెచ్ఎంసీ, హెచ్ఎంఆర్, ప్రజా ప్రతినిధులు చాలాసార్లు ప్రకటనలు చేశారు. ముందుగా 40 చోట్ల కాంప్లెక్సులు నిర్మించనున్నట్లు చెప్పిన ప్రభుత్వం... తర్వాత వాటి సంఖ్యను 22కు, ఆ తర్వాత 12కు కుదించింది. మధ్యలో స్టాక్ పార్కింగ్ విధానాన్నీ తెరపైకి తెచ్చింది. ప్రైవేటు సంస్థలు, వ్యక్తులతో కలిసి పీపీపీ పద్ధతిలో పార్కింగ్ కాంప్లెక్సులు నిర్మించాలన్న ప్రతిపాదన తెచ్చారు. అయితే... ఇప్పటివరకు వీటిలో ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మెట్రో రైలు స్టేషన్లు, ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, బస్ డిపోలు, కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాల్లో మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాల అవసరం ఉంది.
ప్రభుత్వం, అధికారుల ప్రకటన మాటెలా ఉన్నా... నగరంలో పార్కింగ్ స్థలాలు అందుబాటులో లేకపోవడం వల్ల వాహనదారులు నిత్యం అవస్థలు పడుతున్నారు. మరోవైపు రోడ్డుపై వాహనాలు నిలిపితే.. ట్రాఫిక్ పోలీసులు వెనకాముందు చూడకుండా భారీగా జరిమానాలు విధిస్తున్నారు. రోడ్లపై ట్రాఫిక్ సమస్య తలెత్తితే వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడ స్తంభిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పటికైనా సత్వరమే మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్సుల నిర్మాణం పూర్తి చేయాలన్న నిపుణులు సూచిస్తున్నారు.
పాదచారుల వలన మరింత పెరుగుతున్న సమస్య: ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణ లేకపోవడంతో కొన్ని చోట్ల వాహనాలు దాదాపు కిలోమీటర్ మేర బారులు తీరుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు పాదచారులు రోడ్డు దాటేందుకు కొంత సమయం కేటాయించి ఆ తర్వాత వాహనాలు వెళ్లేందుకు సిగ్నళ్లు వేయాల్సి ఉంటుంది. అలా కాకుండా పాదచారులు మధ్యమధ్యలో రోడ్డు దాటుతున్నారు. దీని వల్ల వాహనాలు అక్కడే నిలిచిపోతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు అక్కడే ఉన్నా పాదచారుల రాకపోకలను నియంత్రించకుండా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులు రహదారులపైకి వస్తే, ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తున్నా వారిలో మార్పు రావడం లేదు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పోలీసులు మరింత చొరవ తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: