కొద్దిరోజులుగా ఆయా విశ్వవిద్యాలయాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులు మూల్యాంకనాన్ని త్వరగా పూర్తిచేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచిస్తున్నారు. ఈక్రమంలో పలు అంశాలను వర్సిటీ అధికారులు పరిశీలిస్తున్నారు. ‘వాస్తవానికి మే 10 నాటికి పరీక్షలు పూర్తయి మూల్యాంకనం మొదలవుతుంది. ఈ దఫా డిగ్రీ చివరి సెమిస్టర్ పరీక్షలనే జులై 1 నుంచి నిర్వహించాలని యూజీసీ సూచించింది. జూన్ మూడో వారం నుంచి ప్రారంభించాలని అనుకుంటున్నాం. ఈసారి అన్నీ అసాధారణ నిర్ణయాలే ఉంటాయి’ అని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ తుమ్మల పాపిరెడ్డి చెప్పారు. విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా పరీక్షల మొత్తం ప్రక్రియను సకాలంలో పూర్తిచేసేందుకు వర్సిటీలు స్వేచ్ఛ తీసుకోవచ్చని చెబుతున్నామన్నారు.
ప్రణాళికలు సిద్ధం?
అనేక అంశాలపై ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చిన విశ్వవిద్యాలయాలు సంబంధిత ప్రణాళికను కొద్దిరోజుల్లో ఉన్నత విద్యామండలికి సమర్పించనున్నాయి. దానిపై ప్రభుత్వంతో చర్చించి తుది నిర్ణయానికి వస్తారు. జూన్ మొదటి వారంలో పదో తరగతి పరీక్షలు పూర్తవుతాయని, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో పరిశీలించి వాటిని డిగ్రీ పరీక్షలకు అమలు చేస్తామని వర్సిటీ అధికారులు చెబుతున్నారు.
డిగ్రీ స్పాట్ ప్రవేశాల్లో చేరేవాళ్లకే బోధనా రుసుం
ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో స్పాట్ ద్వారా ప్రవేశాలు పొందే విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం(2020-21)లో బోధనా రుసుం పొందేందుకు అర్హత కల్పించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి త్వరలో ప్రతిపాదించనుంది. ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్(సీబీసీఎస్) కారణంగా డిగ్రీలోనూ సెమిస్టర్ విధానం అమల్లోకి వచ్చింది. ఈ విద్యా సంవత్సరం(2019-20) దోస్త్ ద్వారా డిగ్రీలో ప్రవేశాలకు 5 విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. దాంతో విద్యా సంవత్సరం ప్రారంభం ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం(2020-21)లో మూడు విడతల్లోనే దోస్త్ కౌన్సెలింగ్ జరపాలని జనవరిలో నిర్ణయించారు.
రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం
కరోనా మహమ్మారి కారణంగా ప్రవేశాలు మరింత జాప్యమయ్యే అవకాశాలు ఉండటంతో కౌన్సెలింగ్‌ను రెండు విడతలకే పరిమితం చేయాలని భావిస్తున్నారు. దానికితోడు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలకు 30 శాతం యాజమాన్య కోటా ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. దీనిపై జీవో జారీ కావాల్సి ఉంది. అయితే రెండు విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తే 70 శాతం కన్వీనర్ కోటాకు సంబంధించి మిగిలిపోయే సీట్లకు స్పాట్ ద్వారా ప్రవేశాలు కల్పించాలని కళాశాలల యాజమాన్యాలు ఇప్పటికే ఉన్నత విద్యామండలికి విన్నవించాయి. ఆ విధానంలో చేరేవారికీ ఫీజు రీఎంబర్స్‌మెంట్ సైతం వర్తింపజేయాలని కోరాయి. ఈక్రమంలో దానిపై త్వరలో ఉన్నత విద్యామండలి చర్చించి సర్కారుకు ప్రతిపాదన పంపనుంది. తుది నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని విద్యామండలి ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.