Telangana Budget Sessions 2023-24: బడ్జెట్ పద్దులపై శాసనసభలో రెండోరోజు చర్చ జరగనుంది. సమాచార - పౌర సంబంధాలు, పరిశ్రమలు, ఐటీ, పురపాలక, కార్మిక, దేవాదాయ, అటవీ, న్యాయ, ఇంధన, విద్యాశాఖకు చెందిన మొత్తం 12 పద్దులపై ఇవాళ చర్చ చేపట్టనున్నారు. ప్రశ్నోత్తరాల అనంతరం పద్దులపై చర్చ ఉంటుంది.
వైద్య కళాశాలలు, ఆసరా ఫించన్లు, ఆయిల్‌పామ్ సాగు, పోడు భూముల సమస్య, న్యూట్రిషన్ కిట్, పోలీసు శాఖలో ఖాళీల భర్తీ, రైతుబీమా, ఆరోగ్యలక్ష్మీ పథకాలు, షీటీమ్స్ అంశాలు ప్రశ్నోత్తరాల్లో ప్రస్తావనకురానున్నాయి. పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లును మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేడు సభలో ప్రవేశపెట్టనున్నారు. భద్రాచలం, సారపాక, రాజంపేట గ్రామపంచాయతీల ఏర్పాటు కోసం చట్టాన్ని సవరిస్తూ బిల్లు ప్రవేశపెట్టనున్నారు.
తెలంగాణ శాసనసభ గురువారం పలు పద్దులను ఆమోదించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమం, రోడ్లు- భవనాల, రిజిస్ట్రేషన్లు, ఆబ్కారీ, పర్యాటకం, క్రీడలు, యువజన వ్యవహారాలు, సాంస్కృతిక శాఖల పద్దులను ఆమోదించింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన శాసనసభ రాత్రి 11 గంటల వరకు జరిగింది. బిల్లుల ఆమోదం అనంతరం శాసనసభ నేటికి వాయిదా పడింది.
ప్రశ్నలకు బదులు ప్రసంగాలా : శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పలు దఫాలు సభ్యులపై అసహనం వ్యక్తంచేశారు. బడ్జెట్ సమావేశాలు ఈ నెల 3న ప్రారంభమవగా, రోజువారీగా నిర్వహించే ప్రశ్నోత్తరాలను బుధవారం వరకు రద్దు చేశారు. గురువారం తొలిసారి ప్రశ్నోత్తరాలను స్పీకర్ చేపట్టారు. 18 మంది ఎమ్మెల్యేలు పలు అంశాలపై ప్రశ్నలడిగారు.
ఈ సందర్భంగా కొందరు సభ్యులు ప్రశ్నల కన్నా, ప్రభుత్వాన్ని పొగుడుతూ ప్రసంగాలు చేయటంతో స్పీకర్ అసహనం వ్యక్తంచేశారు. ‘ఇది ప్రశ్నోత్తరాల సమయం. ప్రశ్నలను మాత్రమే అడగండి. ప్రసంగాలు వద్దు’ అంటూ పదేపదే సూచించారు. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ ఒక్కరే ప్రశ్నలు అడిగి, తన స్థానంలో కూర్చోటంతో ఆయన్ను అభినందించారు. ప్రసంగం వద్దు అని స్పీకర్ వారిస్తున్నా.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తాను రాసుకొచ్చిన ప్రసంగాన్ని చదివారు.
కొత్త రేషన్‌కార్డులిస్తాం: రాష్ట్రంలో కొత్త రేషన్‌కార్డులిస్తామని పౌరసరఫరాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. తమ శాఖల పద్దులపై గురువారం శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.
ఇవీ చదవండి: