రాష్ట్రంలో గత రెండేళ్లలో మరణాల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ఏడాది ఒక్క మే నెలలోనే రికార్డు స్థాయిలో 23,242 మంది అసువులు బాశారు. అంటే రోజుకు సగటున 749 మంది చనిపోయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2019లో 1,22,102 మరణాలు సంభవించగా 2020లో ఆ సంఖ్య 1,54,992కు చేరింది. ఇక 2021 మే నాటికి 76,024 మరణాలు నమోదైనట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలతో సమానంగా జీహెచ్‌ఎంసీలో మరణాలు నమోదయ్యాయి.
రాష్ట్రంలో జీహెచ్‌ఎంసీ మినహా గ్రామాలు, పట్టణాల్లో మరణాల నమోదు రేటు 2018తో పోలిస్తే 2019లో 37.65% పెరిగింది. 2020, 2021 నాటికి ఆ సంఖ్య దాదాపు రెట్టింపైంది. గ్రామాలు, పట్టణాలు, ద్వితీయ శ్రేణి నగరాల్లో మే నెలలో అత్యధిక స్థాయిలో 12,384 మంది మరణించినట్లు క్షేత్రస్థాయి నుంచి అధికారులకు సమాచారం అందింది. ఇప్పటికే 12,299 మరణాలను జనన, మరణ ధ్రువీకరణ అధికారులు రికార్డు చేశారు. ఈ లెక్కన రోజుకు 400 మంది చొప్పున చనిపోయినట్లు వెల్లడైంది. రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, మున్సిపాలిటీలు, గ్రామాల్లో మరణ ధ్రువీకరణ పత్రాల కోసం నమోదు చేస్తున్న వివరాలు పరిశీలించగా ఈ విషయం వెల్లడైంది.
జీహెచ్‌ఎంసీలో మే నెలలో 10,858 ధ్రువీకరణ పత్రాలు జారీ అయ్యాయి. అంటే రోజుకు సగటున 350 మంది చొప్పున మరణించినట్లు. మరణాలు గత ఏడాది జూన్ నుంచి ఎక్కువ ఉన్నాయి. గ్రామాలు, పట్టణాల్లో సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరులలో సగటున నెలకు 8500కు పైగా మరణాలు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో సగటున నెలకు 6,200కు పైగా మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ అయ్యాయి.
కొన్ని మరణాల నమోదులో జాప్యం
రాష్ట్రంలో ప్రతి మరణం రికార్డు అవుతోంది. జనన, మరణ ధ్రువీకరణ అధికారులు ఆయా వివరాలను ఆన్‌లైన్లో నమోదు చేస్తున్నారు. ఆసుపత్రుల్లో మరణిస్తే సమాచారం నేరుగా సమీపంలోని సంబంధిత మరణ, జనన ధ్రువీకరణ అధికారుల వద్దకు వెళ్తుంది. ఇంట్లో మరణించినప్పుడు బంధువులు పంచాయతీ, మున్సిపాలిటీ వార్డు కార్యాలయాల్లో సమాచారమిస్తారు. పట్టణాల శ్మశాన వాటికల్లో దహన నమోదు రసీదు జతచేయాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తుపై అధికారులు క్షేత్రస్థాయిలో సమాచారాన్ని తీసుకుని మరణ ధ్రువీకరణ పత్రం ఇస్తారు. ఆసుపత్రుల్లో మరణాలు ఎప్పటికప్పుడు రికార్డుల్లో చేరుతున్నా ఇంటివద్ద జరిగిన సహజ మరణాల నమోదులో జాప్యమవుతోంది. కుటుంబసభ్యులు కొందరు ఆలస్యంగా వివరాలు ఇస్తుండటం అందుకు కారణం. ఇటీవల లాక్‌డౌన్‌లో గ్రామాలు, మున్సిపాలిటీలు, నగరాల్లో మరణాల వివరాలు నమోదు కాలేదు. గ్రామాలు, పట్టణాల్లో ఈ ఏడాది మే నెలలో 12,384 మరణాలు ఉంటే... జూన్‌లో 14 నాటికే 6,972 నమోదయ్యాయి.
ఇదీ చదవండి: Covid Effect: పండుటాకులపై పెరిగిన వేధింపులు... తప్పని ఛీత్కారాలు