ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతూనే ఉంది. విధుల్లో చేరేందుకు కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గడువు నేటి అర్ధరాత్రితో ముగియనుంది. ఇవాళ అర్ధరాత్రి దాటాక ఎవరినీ విధుల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రభుత్వ పిలుపుపై కార్మికులు పెద్దగా స్పందించలేదనే చెప్పాలి. మొదటి రెండు రోజులు అంటే ఆది, సోమ వారాల్లో కార్మికులు పదుల సంఖ్యలో విధుల్లో చేరేందుకు ముందుకు వచ్చారు. మూడో రోజైన ఇవాళ కాస్త స్పందన కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం ఐదు గంటలకు వరకు 208 మంది ఉద్యోగులు విధుల్లో చేరారు.
బస్ భవన్లో
ఆర్టీసీ ప్రధాన కార్యాలయమైన బస్ భవన్లో విధుల్లో చేరిన వారి సంఖ్య అధికంగా ఉంది. ఉద్యోగులు డిపోల వద్దే కాకుండా ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లోనూ విధుల్లో చేరే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలో 5,100 ప్రైవేట్ బస్సులకు అనుమతులు ఇచ్చేందుకు మంత్రివర్గం విధానపర నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన కసరత్తు కొనసాగుతోంది.
మిగతా మార్గాలను కూడా...
కార్మికులు విధుల్లో చేరకపోతే మిగతా మార్గాలను కూడా ప్రైవేట్ పరం చేస్తామని... అప్పుడు రాష్ట్రం ఆర్టీసీ రహితం అవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. గడువు తీరాక అన్ని అంశాలను పరిశీలించి తదుపరి కీలక నిర్ణయం తీసుకుంటామని సీఎం ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి వరకు ఎంత మంది కార్మికులు విధుల్లో చేరతారు, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఇదీ చూడండి: తహసీల్దార్ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!?