కరోనా (Corona) బాధితుల రక్తమాంసాలను పీల్చుకుతింటున్న ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకోకుండా… కొవిడ్ (Covid) నిబంధనలు పాటించి ఆస్పత్రిని సందర్శించిన తమపై పోలీసులు పెట్టడం ఏంటని ఏఐసీసీ (Aicc) అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ (Dasoju sravan) ప్రశ్నించారు. ఖైరతాబాద్ బడాగణేశ్ సమీపంలో ప్రభుత్వ ఆస్పత్రి ఉందని.. దానిని కాంగ్రెస్ సర్కార్ రూ. 10 కోట్లు వ్యయంతో నిర్మించిందన్నారు. 50 బెడ్లు సామర్థ్యం కలిగిన ఇక్కడ 100 బెడ్ల వరకు పెంచవచ్చని... దీనిని కొవిడ్ కోసం వాడుకోవాలని తాము చెబుతున్నా సర్కార్ పట్టించుకోలేదని విమర్శించారు.
గత వారం కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ఆస్పత్రిని సందర్శిస్తే తమపై సర్కార్ కేసులు పెట్టిందని విమర్శించారు. పాతబస్తీలో ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి ఇంట్లో పెళ్లి వేడుకలో 1,000 మంది హాజరైనా… దానికి హోం మంత్రి, డీజీపీలు హాజరైనా ఎలాంటి కేసులు లేవన్నారు. ప్రజల తరఫున ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలపై కేసులు ఎలా పెడతారని నిలదీశారు.