మద్యం తాగి రోడ్డెక్కుతున్నారా..? అయితే.. అప్రమత్తం కావాల్సిందే. లేదంటే మీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు కావడం ఖాయమని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాదిలో 2,119 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లను రద్దు చేయించారు.
23,668 మందుబాబులపై కేసులు..
మద్యం తాగి వాహనాలు నడిపిస్తుండటంతో రహదారులు నెత్తురోడుతున్నాయి. 30 శాతానికి పైగా రోడ్డు ప్రమాదాలకు ఇదే కారణమని సైబరాబాద్ పోలీసులు అధ్యయనంలో తేల్చారు. డ్రంకెన్ డ్రైవింగ్‌తో ఈ ఏడాదిలో 802 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 161 మంది దుర్మరణం చెందగా.. 745 మంది క్షతగాత్రులయ్యారు. ఇలాంటి తరుణంలోనే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. అప్పట్లో వారాంతాలకే పరిమితమైన డ్రంకెన్ డ్రైవింగ్ తనిఖీలను రోజు చేపట్టాలని నిర్ణయించారు. జనవరి నుంచి జులై వరకు 23,368 మంది మందుబాబులపై కేసులు నమోదు చేశారు.
3,629 లైసెన్స్‌ల రద్దుకు సిఫార్సు..
అప్పట్లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో చిక్కితే వాహనాలను సీజ్ చేసేవారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చేవారు. అనంతరం న్యాయస్థానం ముందు హాజరుపరిచేవారు. అయితే.. ఇప్పుడు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. మందుబాబుల డ్రైవింగ్ లైసెన్స్‌లను రద్దు చేయించాలని నిర్ణయించారు. ఇదీ కాకుండా వాళ్లు పనిచేసే సంస్థలకు కూడా లేఖలు రాస్తున్నారు. ఈ ఏడాది జులై వరకు 3,629 మంది మందుబాబుల డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేయమంటూ ఆర్టీఏకు లేఖలు రాశారు. ఇందులో 2,119 లైసెన్స్‌లు రద్దయ్యాయి.
31 మందిపై క్రిమినల్ కేసులు...
మద్యం తాగి తీవ్ర రోడ్డు ప్రమాదాలకు కారణమైతే ఐపీసీ 304 సెక్షన్ పార్ట్-2 కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తున్నారు. ఓ ఠాణా పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి మరణానికి కారణమైన కుమారుడిని రిమాండ్‌కు పంపించారు. నిబంధనల ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ రద్దైన వ్యక్తి వాహనాలను నడిపించకూడదు. ఆ గడువు ముగిసిన తర్వాత రీఫ్రెష్‌మెంట్ కోర్సు పూర్తి చేయాలి. అప్పుడు లైసెన్స్‌ను తిరిగి పునరుద్ధరిస్తారు. అయితే.. కొందరు మందుబాబుల తమ లైసెన్స్ రద్దైనా వాహనాలను నడిపిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే అలాంటి వారిని గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్‌కు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు 31 మందిని గుర్తించారు. వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయించి రిమాండ్‌కు తరలించినట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.
పట్టుబడితే రూ.పది వేలు.. జైలు శిక్షలు అదనం
'మోతాదుకు మించి మద్యం తాగి కార్లు, బైకులు, ఆటోలు, బస్సులు, లారీలు నడుపుతూ పట్టుబడితే రూ.10 వేలు జరిమానా చెల్లించాలి. డ్రైవింగ్ లైసెన్స్ రద్ధు. జైలుశిక్ష అదనం' అని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. మత్తులో వాహనాలు నడుపుతున్న వారి సంఖ్య పెరుగుతుండడం, వారాంతాల్లో విందులు, వినోదాల కారణంగా ప్రమాదాలు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు నిత్యం డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. నెలలో ఐదుసార్లు దొరికితే రూ.50 వేలు జరిమానా చెల్లించాలంటున్నారు.
జరిమానా ఇందుకే...
రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రయాణికుల భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం మోటారు వాహనాల సవరణ చట్టం-2019ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం రహదారులపై నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేస్తే భారీగా జరిమానాలు కట్టాలి. మైనర్లు వాహనం నడిపితే రూ.25 వేలు, మోతాదుకు మించి మద్యం తాగి వాహనం నడిపితే రూ.10 వేలు, ఫోన్లో మాట్లాడుతూ బండి నడిపితే రూ.5 వేలు చెల్లించాలి. కోర్టులు విధించే శిక్ష అనుభవించాలి. గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు కరోనా కారణంగా పోలీసులు తనిఖీలు నిర్వహించలేదు.
కొవిడ్ నిబంధనల మేరకు కౌన్సెలింగ్..
మద్యం తాగి వాహనాలు నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డ వారిని గోషామహల్, బేగంపేట శిక్షణ కేంద్రాలకు తీసుకెళ్తున్నారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు. మద్యపానం వల్ల కలిగే నష్టాలకు సంబంధించిన లఘుచిత్రాలను వారికి చూపిస్తున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరుస్తున్నారు. జరిమానాలు చెల్లించిన తర్వాతే వాహనాలను తిరిగి ఇస్తున్నారు. కౌన్సెలింగ్‌కు రాని వారికి ఫోన్లు చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు సమర్పించిన నివేదికల ఆధారంగా ఇప్పటి వరకు ఇద్దరికి శాశ్వతంగా, ఒకరికి ఆరు నెలలపాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దయ్యింది.
ఇదీ చదవండి: Hyderabad Traffic: వాన పడితే వణుకుతున్న వాహనదారులు.. కారు పూలింగే పరిష్కారమా..!