కరోనా విషయంలో సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దని.. సైబరాబాద్ సీపీ సజ్జనార్ కోరారు. ఐటీ కారిడార్లో కరోనాపై ఏవైనా అపోహలుంటే సైబరాబాద్ పోలీసులను సంప్రదించాలని పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం మైండ్స్పేస్లో ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చిందన్న వదంతులతో ఐటీ ఉద్యోగులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సంబంధిత ఉద్యోగికి నెగిటివ్ రిపోర్ట్ రావటం వల్ల ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నా.. ఈ చర్యతో ఐటీ పని వాతావరణంపై ప్రభావం పడింది.
నమ్మకండి
వదంతులతో ఎక్కువ నష్టం వాటిల్లుతోందని గ్రహించిన ఐటీ సెక్టార్ కరోనాపై.. ఐటీ ప్రతినిధులతో కలిసి కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సీపీ సజ్జనార్ నోడల్ అధికారిగా వ్యవహరించారు. కరోనా వైరస్ గురించి సామాజిక మాధ్యమాల్లో వదంతులను నమ్మద్దని సీపీ విజ్ఞప్తి చేశారు. హెల్త్ డిపార్ట్మెంట్, ఐటీ కంపెనీల ప్రతినిధులతో కలిసి కరోనా పై ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఇంటి నుంచే పని
ఐటీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదని ఐటీ కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. విదేశాలకు వెళ్లి వచ్చి ఉద్యోగులను రెండు వారాల పాటు ఇంటి దగ్గరి నుంచి పని చేయాలని కోరుతున్నామన్నారు. మీడియా, సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలతో ఐటీ కంపెనీల ప్రగతిపై ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
మన దగ్గర కరోనా బతకదు
కరోనా వ్యాప్తి పై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఫీవర్ హాస్పిటల్ సూపరిడెంటెంట్ శంకర్ అన్నారు. వేడి వాతావరణ పరిస్థితుల్లో కరోనా వైరస్ బతికే అవకాశాలు చాలా తక్కువని స్పష్టం చేశారు.
కరోనాపై భయంతో ప్రతి ఒక్కరూ మాస్క్లు వాడాల్సిన అవసరం లేదని, ఈ వైరస్ గాలిలో 15 నిమిషాల కన్నా ఎక్కువ బతకదని అధికారులు తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రతతో ఎలాంటి వైరస్నైనా దూరం పెట్టొచ్చని, ప్రజలు భయాందోళనళకు గురికావొద్దని స్పష్టం చేశారు.
- ఇదీ చూడండి : రాష్ట్రంలోకి కరోనా రానివ్వం: కేసీఆర్