తెలంగాణ షీటీమ్స్, మహిళా భద్రత విభాగం, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో సైబర్ కాంగ్రెస్ పేరిట ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీనికి యంగిస్థాన్ స్వచ్ఛంద సంస్థ సహకారం అందిస్తోంది.
ఏమేం నేర్పిస్తారంటే..?
ఆన్‌లైన్‌లో పాఠాలు వింటున్న సమయంలో పిల్లలను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారు. వారిని వివిధ మార్గాల్లో బెదిరించి డబ్బులు గుంజడమో.. ఇతరత్రా చర్యలకు దిగుతున్నారు. సైబర్ నేరాల తీరు.. జాగ్రత్తలు, సైబర్ నేరగాళ్లపై ఎలా ఫిర్యాదు చేయాలో వివరిస్తున్నారు. పదినెలల పాటు తెలుగు, ఆంగ్లం భాషల్లో శిక్షణ జరగనుంది.
జిల్లాకు వంద మంది విద్యార్థులు
కార్యక్రమాన్ని అధికారులు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. పోలీసు శాఖ తరఫు నుంచి రాష్ట్ర మహిళా విభాగం భద్రత అధికారి స్వాతిలక్రా.. విద్యాశాఖ తరఫున సమగ్ర శిక్ష సమన్వయకర్త రమేశ్ పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ జిల్లాకు పోలీసు శాఖ తరఫున సమన్వయకర్తగా అదనపు డీసీపీ శిరీష, సమగ్ర శిక్ష సమన్వయకర్త శిరీష వ్యవహరిస్తున్నారు. సైబర్ కాంగ్రెస్‌లో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో జిల్లాకు 50 చొప్పున పాఠశాలలు ఎంపిక చేశారు. ప్రతి పాఠశాల నుంచి 8 లేదా 9 తరగతికి చెందిన ఇద్దరు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయురాలిని ఎంపిక చేసి పది నెలలపాటు వర్చువల్‌గా శిక్షణ ఇస్తున్నారు. అనంతరం వీరు పాఠశాలలోని మిగిలిన విద్యార్థులు, సమీప కాలనీలు, గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పిస్తారు.
హాజరు తప్పనిసరి
విద్యార్థులకు యాక్టివిటీ ఆధారంగా అవగాహన కల్పించనున్నారు. వారు తయారు చేసిన గోడపత్రికలు, నినాదాల కరపత్రాలను సైబర్‌పాఠశాల పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు. శిక్షణకు హాజరయ్యేవారికి హాజరు తప్పనిసరి. మాడ్యూల్ యాప్ సాయంతో హాజరు తీసుకుంటారు. శిక్షణ తరువాత ధ్రువీకరణ పత్రాలిస్తారు.
సైబర్‌నేరాలపై అవగాహన అవసరం
'ప్రస్తుతం విద్యావ్యవస్థలో వచ్చిన మార్పుల దృష్ట్యా సైబర్ నేరాలపై అవగాహన ఎంతో అవసరం. బాలబాలికలు ఆన్‌లైన్‌లో గడిపే సమయంలో అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాలి. పాస్‌వర్డ్ నుంచి చరవాణి వినియోగం వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. శిక్షణలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు అర్థమయ్యేలా నిపుణులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో అవగాహన కల్పిస్తున్నాం. శిక్షణ పొందిన విద్యార్థులు తోటి పిల్లలతోపాటు పాఠశాలల చుట్టుపక్కల ప్రాంతాలు, తల్లిదండ్రులకు సైబర్‌భద్రతను వివరిస్తారు.'
-స్వాతిలక్రా, రాష్ట్ర మహిళా విభాగం భద్రత అధికారి.
ఇదీచూడండి: Cyber crime: సైబర్ మోసాలకూ స్పెషల్ కోచింగ్ సెంటర్లు.. పట్టణాల్లో బహిరంగంగానే...