సైబర్ నేరగాళ్లు... ఎప్పుడు ఎటువైపు నుంచి నిధులు కొల్లగొడతారో... ఊహించలేం. తీరా డబ్బులు పోయాక... పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. ప్రస్తుతం ఈ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకొని అనేక మంది బాధితులవుతున్నారు. చేసేది లేక పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉంటే... తగు జాగ్రత్తలు తీసుకోవడం సులభతరం అవుతోంది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు, సైబరాబాద్ భద్రత మండలి సంయుక్తంగా సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ సదస్సు నిర్వహించారు. హెచ్‌ఐసీసీలో జరిగిన ఈ సదస్సులో 600లకు పైగా ఐటీ సంస్థల ప్రతినిధులు, పలు రాష్ట్రాల ఐపీఎస్, జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సామాజిక మాధ్యమాలు కూడా ప్రమాదమే
సైబర్ నేరాల అదుపు, భవష్యత్తులో సైబర్ క్రైమ్‌లో ఎదురయ్యే సవాళ్లు, మహిళల భద్రతతో పాటు పలు అంశాలపై నిపుణులు సదస్సులో చర్చించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా సైబరాబాద్ సీపీ సజ్జనార్, సెర్ట్ డైరెకర్ట్ జనరల్ సంజయ్ బాహల్, మైక్రోసాఫ్ట్ ఎండీ రాజీవ్ కుమార్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. పిల్లలకు చిన్న వయసు నుంచే సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తే పూర్తిగా అరికట్టవచ్చని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. గత ఐదేళ్లుగా ఈ సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు. సామాజిక మాధ్యమాలు ఒక ప్రమాదకర ఆయుధం లాంటివని... వాటిని ఆచి తూచి వాడకుంటే మోసపోయే ప్రమాదం ఉందన్నారు.
కొత్త పంథాల్లో నేరాలు
రోజు రోజుకూ సైబర్ నేరగాళ్లు కొత్త పంథాల్లో నేరాలకు పాల్పతున్నారు. గతంలో ర్యాన్సమ్వేర్ వైరస్‌తో ఐటీ కంపెనీలు విలవిలలాడాయి. ఒక కోడింగ్‌ను వాడి ప్రముఖ కంపెనీల డేటాని తస్కరిస్తారు. దాన్ని వారికి కూడా తెరచుకోకుండా లాక్ చేస్తారు. ఇలా ఆ కంపెనీల నుంచి కోట్ల రూపాయల డబ్బులు డిమాండ్ చేస్తారు. ఆ డబ్బు ఇస్తేనే అన్‌లాక్ చేస్తారని సొసైటీ ఫర్ సైబరాబాద్ సైక్యూరిటీ కౌన్సిల్ ఛైర్మన్ భరణి సైబర్ నేరాల గురించి చెప్పారు.
మహిళలే ఎక్కువ
ప్రస్తుతం ఈ సైబర్ నేరగాళ్ల వలలో మహిళలు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ సదస్సులో పలు రాష్ట్రాల పోలీసు అధికారులే కాకుండా కేంద్ర పారామిలటరీ ప్రతినిధులు పాల్గొన్నారని భరణి తెలిపారు. అంతే కాకుండా సినిమా పరిశ్రమలో జరిగే పైరసీ సమస్యపై కూడా చర్చించారు.
ఇవీ చూడండి: ఇకపై ఫోన్ పే నుంచీ 'ఏటీఎం' సేవలు