Cyber Crime Cheating in Hyderabad: ఈ బిజీ జీవితంలో మొబైల్ ఫోన్ నిత్యావసర అవసరం లాగా మారిపోయింది. పడుకొని లెేచిన దగ్గర నుంచి మరలా పడుకునే వరకు దాని చుట్టూనే తిరుగుతున్నాం. ఎంతలా అంటే తిండి లేకపోయిన ఉండగలం గానీ ఈ ఫోన్ లేకపోతే ప్రాణం పోయినట్లు ఉంటుంది అనేలా మారిపోయాం. అయితే ఇలా ప్రతి అవసరానికి సెల్ఫోన్ ఎంతలా ఉపయోగపడుతుందో.. అంతే అనర్థాలకు దారితీస్తుంది.
ఆర్మీ కాంట్రాక్ట్ పేరుతో రూ.25 లక్షలు టోకరా: సైబర్ నేరగాళ్లు అమాయకుల బలహీనత, అత్యాశను ఆసరాగా చేసుకొని సొమ్ము చేసుకుంటున్నారు. అందినకాడికి దండుకుంటున్నారు. మరికొందరు బ్లాక్ మెయిల్ చేస్తూ అక్రమాలకు తెరతీస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. ఆర్మీ అధికారుల పేరుతో స్కానింగ్ యంత్రాలు కావాలంటూ ఫార్మా కంపెనీకి టోకరా పెట్టారు. ఆర్మీ రూల్స్ ప్రకారం ముందుగా కొంత డబ్బు డిపాజిట్ చేయాలని నమ్మబలికారు. ఫార్మా కంపెనీ బలహీనతను ఆసరాగా చేసుకుని విడతల వారిగా 25 లక్షల రూపాయలు దండుకున్నారు. ఆ డబ్బు తమకు రాలేదని మళ్లీ పంపాలనడంతో కంపెనీ ప్రతినిధులకు అనుమానం వచ్చింది. తాను మోసపోయామని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
న్యూడ్ వీడియో కాల్స్ చేసి.. రూ.5 లక్షలు కాజేసి : తెలిసిన వ్యక్తిలా చాటింగ్... తీయటి మాటలతో డేటింగ్... వలపు వల విసిరి నగ్న వీడియో కాలింగ్...! చివరకు ఆ వీడియోలు వైరల్ కావొద్దంటే డబ్బులు కట్టాలంటూ బ్లాక్‌మెయిలింగ్.. వలపు వల విసురుతూ... నగ్న వీడియోలు సేకరించి ప్రభుత్వ ఉద్యోగిని మోసం చేసిన ఘటన నగరంలో చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఓ ప్రభుత్వ ఉద్యోగి సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కాడు. అందమైన యువతి ఫోన్ చేయగానే ఆ ఉద్యోగి ఏమనుకున్నాడో ఏమో మాటలు కలిపాడు. అది ఆసరాగా తీసుకున్న ఆ యువతి ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పింది. అలా ఏర్పడిన స్నేహం కాస్త వీడియో కాల్స్ వరకు వెళ్లింది. ఆ తర్వాత ఇదే అదునుగా భావించిన ఆ యువతి ఉద్యోగిని తనదైన పంథాలో బోల్తా కొట్టించింది.
న్యూడ్ వీడియో కాల్స్ చేసి రికార్డ్ చేసి.. ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెడతానని బ్లాక్ మెయిల్ చేసి... 5 లక్షల రూపాయలు కాజేసింది. ఇంకా డబ్బులు డిమాండ్ చేయడంతో... బాధిత ఉద్యోగి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకొని... దర్యాప్తు చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ తెలిపారు.
ఇవీ చదవండి: