మోసపోయే వారు ఉన్నంత కాలం.. మోసం చేసే వారు ఉంటూనే ఉంటారన్నది వాస్తవం. దీనిని తట్టుకోవాలంటే.. మనమే అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. మరి అందుకు తెలుసుకోవాల్సిన విషయాలేమిటో చూద్దాం..
తెలిసిన వారే..
నమ్మిన వారి చేతిలో మోసపోయిన వారెందరో.. ఆర్థిక విషయాల్లో ఇది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. సామాజిక వేదికల పుణ్యమా అని ఇప్పుడు స్నేహితుల సంఖ్య బాగా పెరిగింది. అందులో ఎవరు మనకు మంచి చేస్తారో.. ఎవరు మోసం చేస్తారో తెలుసుకోవడం కష్టమే. కొందరు పెట్టుబడి సలహాదార్ల రూపంలో ఉంటారు.. మరికొందరు మనకు తెలియని కంపెనీలకు ఏజెంట్లుగా ఉండొచ్చు. తమ ద్వారా డబ్బు పెట్టుబడి పెడితే ఇబ్బడిముబ్బడిగా లాభాలు వస్తాయని చెబుతుంటారు. వారిని నమ్మి పెట్టుబడులు పెట్టామా.. రాబడి మాట అటుంచి.. అసలుకే ఎసరు వస్తుంది.
ఏం చేయాలి?
మీకు ఎంత బాగా తెలిసిన వ్యక్తి అయినా సరే.. అతను/ఆమె చెప్పిన విషయాలను విని.. తొందరపడొద్దు. ఆ పెట్టుబడి పథకం, ఆ కంపెనీ గురించి పూర్తిగా విచారించండి. ఆ పెట్టుబడి పథకం మీ అవసరాలకు ఎంత మేరకు సరిపోతుందో చూసుకోండి. ఆ వ్యక్తి మీకు తెలుసనే వ్యక్తిగత మొహమాటంతో ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కష్టార్జితాన్ని వారి చేతిలో పెట్టకండి.
అవన్నీ నిజం కాదు..
సైబర్ నేరగాళ్లు మోసం చేసేందుకు ఎంచుకునే మార్గం.. ఈమెయిళ్లు లేదా ఫోన్లు. బ్యాంకులు, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్ సంస్థల నుంచి మెయిళ్లు వచ్చినట్లుగా భ్రమింపజేయడం, ఫోన్లు చేస్తుంటారు. వారు అడిగిన ప్రశ్నలకు మనం సమాధానం ఇచ్చామా ఇక అంతే సంగతులు! మన బ్యాంకు నుంచి డబ్బులు అలా వారి ఖాతాలోకి అలా వెళ్లిపోతాయి.
ఏం చేయాలి?
బ్యాంకు, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్ సంస్థలేవీ మీ వ్యక్తిగత వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అడగవు. కాబట్టి, మీకు ఇలాంటి మెయిళ్లు, ఫోన్ కాల్స్ మోసపూరితం అని వెంటనే గుర్తించాలి. నిజంగా అవసరమయితే మీరే బ్యాంకు లేదా ఆయా సంస్థల కార్యాలయాలకు వెళ్లండి. లేదా ఫోన్‌లో అధీకృత సేవా కేంద్రాన్ని సంప్రదించండి.
అధిక వడ్డీ ఆశతో..
మన దగ్గర డబ్బు ఉందని తెలిస్తే చాలు.. చాలామంది అధిక వడ్డీ ఇస్తామంటూ అప్పులు అడుగుతుంటారు. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన వారి నుంచి రుణం తీసుకొని, అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపిస్తుంటారు. ఇలాంటి వారు ఎలాంటి హామీలు, తనఖాలు కూడా ఇవ్వరు. మరికొన్ని సంస్థలూ ఇలాంటి అధిక వడ్డీ ఆశ చూపిస్తుంటాయి. రెండు మూడేళ్లలోనే మీ పెట్టుబడులు రెట్టింపు అవుతాయని చెబుతుంటాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది అసాధ్యం అని తెలిసినా ఇలాంటి వాటి వలలో పడి మోసపోయేవారు ఉంటూనే ఉన్నారు.
ఏం చేయాలి?
నియంత్రణ సంస్థల గుర్తింపు లేని ఏ పథకంలోనూ పెట్టుబడులు పెట్టకూడదు. వ్యక్తులకు రుణాలు ఇచ్చేప్పుడు వారికి ఆ అప్పు తిరిగి తీర్చే స్థోమత ఉందా? లేదా? గమనించండి. మీరు వారికి అప్పు ఇచ్చిన సంగతి మీ కుటుంబ సభ్యులకూ తెలియజేయండి. వారి దగ్గర్నుంచి తగిన హామీ పత్రాలు తీసుకోండి. ఎలాంటి నష్టభయం లేకుండా.. మీ డబ్బుకు తగిన వడ్డీ ఇచ్చే ప్రభుత్వ పథకాలను ఎంచుకోవడం ఎప్పుడూ మేలు.
ఇవీ చూడండి: ఓ ఇంటి కిటికీలోంచి తొంగి చూసిన చిరుత