లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి ఇప్పటివరకు సైబర్ క్రైం పోలీసులకు వందల సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. బ్యాంక్ అధికారులమంటూ తార్నాకకు చెందిన సుబ్బరాయుడు అనే ఖాతాదారుడికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. ఏటీఎం కార్డు కేవైసీ అప్డేట్ చేయాలని.. అందుకు ఓ యాప్ డౌన్‌లోడ్ చేసుకొమ్మని చెప్పారు. వాళ్లు చెప్పిన యాప్ డౌన్‌లోడ్ చేసిన సుబ్బారాయుడు.. తన వద్ద ఉన్న 2 ఏటీఎం కార్డుల వివరాలు నమోదు చేశాడు. వెంటనే అతని ఖాతా నుంచి నుంచి 10 లక్షల నగదు మాయమైంది. మోసపోయానని గ్రహించిన బాధితుడు.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
ప్రేమ పేరుతో 38 లక్షలు స్వాహా...
నగరానికి చెందిన ఓ మహిళ నుంచి ప్రేమ పేరుతో సైబర్ చీటర్స్ 38 లక్షలు కాజేశారు. వెస్ట్‌మారేడ్‌పల్లికి చెందిన సురేఖను.. యూకేలో వైద్యుడినని సైబర్ నేరగాడు పరిచయం చేసుకున్నాడు. ఫేస్‌బుక్‌లో రిక్వెస్ట్ పంపాడు. అది వాట్సాప్ ఛాటింగ్ వరకూ వచ్చింది. ఖరీదైన బహుమతి పంపిస్తానంటూ డాక్టర్ హెర్మన్ పేరుతో సందేశం పంపాడు. రెండు రోజుల తర్వాత దిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి కస్టమ్స్ అధికారినంటూ సురేఖకు ఫోన్ చేశాడు. డాలర్స్ పార్సిల్ వచ్చిందని.. టాక్స్ చెల్లించి తీసుకోవాలని చెప్పాడు. గుడ్డిగా నమ్మిన బాధితురాలు ప్రాసెసింగ్ ఫీజు, ఇన్‌కమ్ టాక్స్, కస్టమ్స్ డ్యూటీ.. పేరుతో 38 లక్షలు ఆన్‌లైన్‌లో చెల్లించారు. ఆ తర్వాత సైబర్ చీటర్ ఫోన్ స్విచ్ఛాఫ్ కాగా.. మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు మహిళ ఫిర్యాదు చేశారు.
అల్పాహారం కావాలంటూ 60 వేలు...
తమ కంపెనీ ఉద్యోగులకు అల్పాహారం సరఫరా చేయాలంటూ మరో సైబర్ మోసం జరిగింది. టోలిచౌకి గుల్షన్‌నగర్ కాలనీకి చెందిన ప్రవీణ అనే మహిళకు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. ఖాతా వివరాలు పంపిస్తే అడ్వాన్స్ పంపిస్తానని చెప్పారు. ఖాతా వివరాలు సేకరించిన సైబర్ చీటర్స్.. ఫోన్‌కు క్యూఆర్ కోడ్ పంపించాడు. దాన్ని క్లిక్ చేయగానే ఆమె ఖాతా నుంచి 60 వేల నగదు మాయమైంది. ఖంగుతిన్న మహిళ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు.
స్నేహితుడి పేరిట మెయిల్ చేసి 50 వేలు..
మరో కేసులో... ఓ వ్యక్తి పేరుతో నకిలీ మెయిల్ ఐడీ క్రియేట్ చేసిన సైబర్ నేరగాళ్లు డబ్బులు అత్యవసరంగా కావాలంటూ స్నేహితుడి పేరుతో మెయిల్ పంపారు. ఇది చూసి నిజమే అనుకొని వాళ్లు పంపిన బ్యాంకు ఖాతాలోకి బాధితుడు 50 వేల నగదు బదిలీ చేశాడు. తర్వాత తార్నాకకు చెందిన మిత్రుడు బాబుకు ఫోన్ చేశాడు. తాను ఎలాంటి మెయిల్ పంపించలేదని బాబు చెప్పాడు. సైబర్ క్రైం జరిగిందని గుర్తించిన బాధితుడు మెయిల్ హ్యాక్ చేసి ఛీటింగ్‌కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పదవులిప్పాస్తామంటూ రెండున్నర లక్షలు...
నిజామాబాద్ జిల్లాలో మహిళలను మోసం చేస్తున్న ముగ్గురు యువకుల వ్యవహారం బయటపడింది. ఎడపల్లి మండలం అంబం(వై) గ్రామానికి చెందిన పవన్‌కుమార్ తన ఇద్దరు స్నేహితులు లక్ష్మణ్, ఎంబడి ప్రసాద్ కలిసి తెలంగాణ సోషల్ సర్వీస్ పేరుతో మోసం చేస్తున్నారు. వాట్సాప్‌లో గ్రూప్ క్రియేట్ చేసి ఓ ప్రధాన పార్టీలో పదవులిప్పిస్తామని నమ్మబలికారు. ఒక్కొక్కరి నుంచి మూడు నాలుగువేలు వసూలు చేశారు. ఇలా వంద మంది నుంచి రెండున్నర లక్షల వరకూ వసూలు చేశారు. కొందరు మహిళల్ని అశ్లీల చిత్రాలతోనూ వేధించారు. మోసపోయామని భావించిన బాధితులు.. గ్రామంలో పంచాయతీ పెట్టగా.. పెట్రోల్‌తో దాడి చేసి పారిపోయారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సైబర్ నేరాల పట్ల ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నా.. జనం మోసపోవడానికి వాళ్ల అత్యాశే కారణమని పోలీసులు చెబుతున్నారు. ఎవరైనా బ్యాంకు ఖాతా తదితర వివరాలు అడిగితె వెంటనే ఆయా శాఖలను సంప్రదించాలని తప్ప గుడ్డిగా వివరాలు చెప్పొద్దంటున్నారు. ఏమైనా అనుమానాలు ఉంటే మోసపోవడానికి ముందే తమకు ఫర్యాదు చేయాలని సైబర్ క్రైం పోలుసులు సూచిస్తున్నారు.
ఇవీ చూడండి: నీటిపారుదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష