Polavaram Project Back Water Dispute: పోలవరం ప్రాజెక్టు కారణంగా తెలంగాణలో ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో సంయుక్త సర్వే చేపట్టడానికి కేంద్ర జలసంఘం అంగీకరించినట్లు తెలంగాణ నీటి పారుదల శాఖ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో 896 ఎకరాలు, ఆరు గ్రామాలు ముంపునకు గురవుతాయని తెలంగాణ.. గురికావని ఆంధ్రప్రదేశ్‌తో పాటు జలసంఘం కూడా ఇప్పటి వరకు వాదిస్తూ వచ్చాయి. బుధవారం జరిగిన అంతర్రాష్ట్ర సమావేశంలో సంయుక్త సర్వేకు నిర్ణయం తీసుకొన్నారు. దిల్లీలోని కేంద్ర జలసంఘం కార్యాలయంలో ఛైర్మన్ వోరా అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఎ), జలసంఘం అధికారులు పాల్గొన్నారు.
CWC Agrees to Joint Survey: తెలంగాణ లేవనెత్తిన పది అంశాలపై చర్చ జరిగింది. ముర్రేడు, కిన్నెరసానితోపాటు మరో ఆరు పెద్దవాగులపై బ్యాక్‌వాటర్ ప్రభావం గురించి అధ్యయనం చేయాలని నిర్ణయించారు. తెలంగాణ నుంచి ఇంజినీర్ ఇన్ చీఫ్ నాగేందర్‌రావు, సీతారామ ఎత్తిపోతల చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్‌రెడ్డి, ఓఎస్‌డీ శ్రీధర్ దేశ్‌పాండే, ఎస్.ఇ.ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి, పోలవరం ప్రాజెక్టు ఎస్.ఇ.సుధాకర్, ఒడిశా నీటిపారుదల శాఖ ఇ.ఎన్.సి.అశుతోష్‌దాస్ తదితరులు పాల్గొన్నారు.
మొదట అంగీకరించన ఏపీ..: పోలవరం ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటి నిల్వ ఉన్నప్పుడు బ్యాక్‌వాటర్ ప్రభావం, వరద సమయంలో ముంపుపై తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలపై ఆంధ్రప్రదేశ్ అధికారులు మొదట అంగీకరించలేదని తెలిసింది. ప్రాజెక్టును ఆపడానికి ఇలా చేస్తున్నారని పేర్కొనగా, జలసంఘం ఛైర్మన్ జోక్యం చేసుకొని అధ్యయనం చేసి నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నట్లు తెలిసింది. 896 ఎకరాలు అదనంగా ముంపునకు గురికావడం, భద్రాచలం వద్ద నీటి మట్టాలు, మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్‌లోకి నీరు, ముంపునకు గురికాకుండా రక్షణ గోడలు ఇలా అన్ని అంశాలపై సంయుక్తంగా అధ్యయనం చేయాలని ఛైర్మన్ సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
సంయుక్త పరిశీలనపై ప్రభుత్వంతో మాట్లాడి చెబుతాం..: పోలవరం ముంపు ప్రాంతాల్లో సంయుక్త పరిశీలనపై తమ ప్రభుత్వంతో మాట్లాడి చెబుతామని ఆంధ్రప్రదేశ్ ఈఎన్‌సీ నారాయణరెడ్డి అంతర్రాష్ట్ర సమావేశంలో తెలిపారు. రెండు రాష్ట్రాల అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని, అందుకు ఏర్పాట్లు చేయాలని కేంద్ర జలసంఘం సీఈవో కుష్వీందర్ వోరా సూచించగా ఆయన ఈ సమాధానం చెప్పినట్లు తెలిసింది.
ఇవీ చూడండి..
ఏపీ ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ లేఖ.. వాటిపై నివేదిక ఇవ్వాలని సూచన
'ఎమ్మెల్యే వేధింపులతోనే పదవికి రాజీనామా చేస్తున్నా'.. కన్నీరు పెట్టుకున్న ఛైర్పర్సన్
ORS పితామహుడికి పద్మవిభూషణ్.. ములాయం సింగ్, జాకీర్ హుస్సేన్ సహా ఆరుగురికి