కాస్త వేడిగా ఉన్న నీళ్లు చర్మంపై పడితేనే మనం అదిరిపడతాం. అలాంటిది సలసల కాగే నూనెలో వేగుతున్న పదార్థాలను.. చేతితోనే బయటకు తీసి చూపిస్తే...? పదే పదే వేడి నూనెలో చెయ్యి పెడుతుంటే..? నమ్మశక్యంగా లేదు కదూ... అయితే.. కర్నూలు జిల్లా హోళగుండకు చెందిన యూసుఫ్ మాత్రం... ఇలాంటి విన్యాసమే చేసి చూపిస్తూ.. అందరినీ అబ్బుర పరుస్తున్నారు. దాదాపు 30 ఏళ్లుగా ఇలా కాగే నూనెలోంచి బజ్జీలు, పకోడీలు తీసి... వాటిని అందరికీ అందిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు.
కర్నూలు జిల్లా హోళగుండ మండలానికి చెందిన యూసుఫ్ (63).. బస్టాండ్లో బజ్జీల కొట్టు ఏర్పాటు చేసుకున్నాడు. అందులోనే బజ్జీలు, చికెన్ పకోడా, కోడి గుడ్డు బోండా వంటివి తయారు చేసి విక్రయిస్తుంటాడు. ఈ క్రమంలో కొనుగోలు చేసేందుకు వచ్చిన వారు త్వరగా ఇవ్వమని బలవంతం చేసే సమయంలో సలసలా కాగే నూనెలో నుంచి వాటిని తీసి అందిస్తుంటాడు. ఇలాంటి సమయాల్లో కొందరు.. ఆకలి మరిచిపోయి ఆశ్చర్యపోవడం.. మామూలుగా జరిగే చిత్రమే.
ఇదీ చూడండి : మాస్టారు సంకల్పం ముందు వైకల్యం చిన్నబోయింది!