Oil Palm Cultivation in Telangana: పెరిగిన పెట్టుబడి ఖర్చులు.. చీడపీడలు.. అన్ని ఆటుపోట్లను ఎదుర్కొని పండించిన పంట చేతికొచ్చే సమయానికి రైతుకు ఏదో ఒక రూపంలో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. నేటి కాలంలో రైతు పరిస్థితి దినదిన గండంగా మారింది. కర్షకులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం రైతులను లాభాదాయకమైన పంటల సాగు వైపు మళ్లిస్తోంది. తక్కువ పెట్టుబడితో.. దీర్ఘకాలం లాభం వచ్చే ఆయిల్ పామ్ సాగుకు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. ఈ పంట సాగులో విశేషమేమంటే.. ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొని రైతులు నాలుగు రాళ్లు వెనకేసుకునేలా దిగుబడులు ఆశాజనకంగా ఇవ్వడం.
రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు, వడగళ్లు, ఈదురుగాలుల వల్ల దాదాపు అన్ని పంటలూ తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నప్పటికీ.. ఆయిల్‌పామ్‌కు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఆరున్నర లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతోంది. రైతు కష్టానికి అదనపు విలువను జోడించేందుకు మూడేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం అయిల్‌పామ్ సాగు పెంపుదలపై దృష్టి సారించింది. రాష్ట్రంలో ఈ పంట వివిధ దశల్లో ఉంది. నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో నాటిన మొక్కలు ఇప్పటికే ఆరడుగుల కంటే ఎక్కువ ఎత్తు పెరిగాయి. రెండేళ్ల కిందట మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో నాటిన మొక్కలు నాలుగడుగులు దాటాయి.
కరీంనగర్, ఉమ్మడి వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో నాటిన మొక్కలు ప్రస్తుతం మూడడుగుల మేర పెరిగాయి. అకాల వర్షాల నేపథ్యంలో వ్యవసాయాధికారులు జిల్లాల వారీగా సర్వే చేయగా.. ఆయిల్‌పామ్‌కు నష్టం వివరాలు నమోదు కాలేదు. ఆయిల్‌పామ్‌లో వేసిన అంతర పంటలు దెబ్బతిన్నప్పటికీ ఈ పంటకు ఎటువంటి నష్టం జరగలేదు.
"ఆయిల్‌పామ్ చీడపీడలు, వివిధ తెగుళ్లు సహా అన్నిరకాల ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటుంది. మొక్కలు, ఆకులు బలంగా ఉంటాయి. వడగళ్ల వాన, ఈదురు గాలుల వల్ల ఎటువంటి నష్టం సంభవించదు. ఈ విషయాన్ని రైతులకు తెలియజేస్తూ.. రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు మరింత పెంచాలని వారిని కోరుతున్నాం." -శ్రీనివాస్‌రావు, ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి, వరంగల్
మొక్కలన్నీ భద్రం.. "ఈసారి వరి, ఇతర పంటలు వేయకుండా ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నాను. గతేడాది పదెకరాల్లో సాగు చేసిన మిర్చి పంట దెబ్బతిని నష్టపోయాను. ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగుకు ఇచ్చిన రాయితీలతో పదెకరాల్లో మొక్కలు వేశాను. వర్షాలకు ఎటువంటి నష్టం వాటిల్లలేదు. నాటిన మొక్కలన్నీ భద్రంగా ఉండటం సంతోషంగా ఉంది". -రాంరెడ్డి, ఎలుకుర్తి, వరంగల్ జిల్లా
ఇవీ చదవండి: