Cuba Solidarity Meetings in Vijayawada: టీషర్ట్, వాహనాల మీద చేగువేరా బొమ్మ వేసుకున్నంత మాత్రాన చేగువేరా ఆశయాలు సాధించినట్లు కాదని క్యూబా విప్లవ కారుడు చేగువేరా కుమార్తె అలైదా గువేరా అభిప్రాయపడ్డారు. చేగువేరా లక్ష్యాలు, ఆశయాల సాధనకోసం పని చేయడమే నిజమైన నివాళన్నారు. ప్రపంచంలో వర్గ, వర్ణ, మత వివక్షలు పోవాలని ప్రజలందరూ మనం అనే భావనతో ఉండాలని అలైదా గువేరా కోరారు.
ప్రపంచంలో అనేక దేశాలు తిరిగిన సందర్భంగా ఆయా దేశాల ప్రజలు ఎదుర్కొంటున్న వివక్షలు, సమస్యలను గుర్తు చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న క్యూబా సంఘీభావ సభలకు చేగువేరా మనమరాలు ఎస్తేఫానియా గువేరాతో కలిసి హాజరయ్యారు. విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన క్యూబా సంఘీభావ సభ ముఖ్యఅతిథిగా అలైదా గువేరా, ఎస్తేఫానియా గువేరా హాజరయ్యారు.
అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచానికి ప్రమాదమని ఈ సభకు హాజరైన వక్తలు అభిప్రాయపడ్డారు. క్యూబా వంటి సేవాగుణం కలిగిన దేశానికి ప్రపంచం దేశాలు సంఘీభావం తెలియజేయాలని వక్తలు కోరారు. వామపక్షాల నేతలతో పాటు, వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల ప్రతినిధులు హాజరై క్యూబాకు సంఘీభావాన్ని ప్రకటించారు.
ఇవీ చదవండి