జనగణనకై కసరత్తు...
2021 జనాభా లెక్కలకు సంబంధించి గ్రామ, పట్టణ రిజిస్ట్రార్లు ఆయా ప్రాంతాల వివరాలు పంపాలని సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి అదర్ సిన్హా ఆదేశించారు. వరంగల్ అర్బన్, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాలో జనాభా లెక్కల ముందస్తు పరీక్ష కోసం ఎన్యుమరేటర్ల ఎంపిక, శిక్షణను పూర్తి చేయాలన్నారు. ఇళ్ల వారీగా జాబితాలు, పరిశీలన చేయాలని సూచించారు. జనగణన శాఖ రూపొందించిన ఆండ్రాయిడ్ యాప్‌ను ఉపయోగించుకోవాలన్నారు. అక్టోబర్ 1 నుంచి కొత్త ఎక్సైజ్ విధానం అమల్లోకి వస్తుందని... గిరిజన ప్రాంతాల్లో ఉన్న 109 షాపులకు సంబంధించి 15 రోజుల్లోగా గ్రామసభ తీర్మాణాలు సేకరించాలని కలెక్టర్లను కోరారు.
ఆగస్టు 15 నాటికి 100 శాతం మరుగుదొడ్లు...
ఆగస్టు 15 నాటికి జిల్లాలలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్ ఆదేశించారు. బహిర్భూమిరహితంగా ప్రకటించే ముందు జియోట్యాగింగ్ చేయాలన్నారు. రూర్బన్పై ప్రత్యేకంగా సమీక్షించి భూకేటాయింపులు పూర్తి చేసి మౌళికవసతుల పనులు చేపట్టాలని సూచించారు.
బ్లాక్‌స్పాట్స్ గుర్తించి మరమ్మతులు...
గ్రామ పంచాయతీలకు సంబంధించిన సమాచారాన్ని ఈ-పంచాయత్ సాఫ్ట్‌వేర్‌లో పొందుపర్చాలని... ఈ విషయమై జిల్లాపంచాయతీ అధికారులతో కలెక్టర్లు ప్రత్యేక సమావేశం నిర్వహించాలని వికాస్‌రాజ్ స్పష్టం చేశారు. జిల్లా రహదారి భద్రతా కమిటి సమావేశాలు నిర్వహించి మినిట్స్ పంపాలన్న ఆర్ అండ్ బీ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ... రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు అధికారులతో కూడిన కమిటీలను ప్రమాద స్థలాల వద్దకు పంపి పరిస్థితిని అంచనా వేయాలని సూచించారు. రహదార్లపై బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తించి తగు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.
ఇవీ చూడండి: సెర్బియా పోలీసుల అదుపులో నిమ్మగడ్డ