CS Santha Kumari Met NDC Delegation: దేశంలో కొత్త రాష్ట్రంగా ఏర్పాటై.. అత్యంత చిన్నరాష్ట్రమైనా.. వివిధ రంగాల్లో గుణాత్మక అభివృద్ధి సాధించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పునరుద్ఘాటించారు. అధ్యయనం కోసం రాష్ట్రంలో పర్యటిస్తున్న.. జాతీయ రక్షణ కళాశాల ప్రతినిధి బృందం బీఆర్కే భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, అధికారులతో సమావేశమైంది. కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం అమలుచేస్తున్న పలు కార్యక్రమాలను జాతీయ రక్షణ కళాశాల బృందానికి శాంతికుమారి వివరించారు.
వేసవిలోనూ పరిశ్రమలు, వ్యవసాయానికి.. నిరంతర 24గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయంలో అద్వితీయమైన పురోగతి సాధించామని, తద్వారా సాగు ఉత్పత్తిలో గణనీయమైన వృద్ధి సాధించినట్లు శాంతికుమారి వివరించారు. రాష్ట్రంలో 2014 లో రూ.5.05 లక్షల కోట్ల ఉన్న జీఎస్డీపీ 2022-2023 నాటికి రూ.13.27 లక్షల కోట్లకు చేరుకుందని.. రూ.1.24 లక్షలు ఉన్న తలసరి ఆదాయం రూ.3.17 లక్షలకు చేరుకుందని వెల్లడించారు.
ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు అనేక విధానాలు ప్రారంభించామని...కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని, దీని ఫలితంగా రాష్ట్రంలో అనేక గ్రోత్ సెంటర్లు అభివృద్ధి చెందాయని సీఎస్ వివరించారు. పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేలా కొత్త జిల్లాలు.. పట్టణాభివృద్ధిని ప్రోత్సహించేందుకు కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మిషన్ భగీరథ పథకం తాగునీటి సమస్యను తగ్గించడమే కాకుండా.. అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు పరిష్కరించడంలో దోహదపడిందన్నారు.
ఆరోగ్యరంగంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని సీఎస్ పేర్కొన్నారు. హరితహారం ద్వారా 270 కోట్ల మొక్కలు నాటడం ద్వారా 7.7 శాతం గ్రీన్‌కవర్ పెంచేలా సహాయపడిందని పేర్కొన్నారు. దృఢమైన, దార్శనికత కల్గిన నాయకత్వం వల్లే రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని జాతీయ రక్షణ కళాశాల ప్రతినిధి బృందం సభ్యులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం చేపడుతున్న.. వివిధ కార్యక్రమాలు, పథకాల ద్వారా అట్టడుగుస్థాయిలోని ప్రజలకు సాధికారత కల్పన సహా టీ-హబ్, ఇతరకార్యక్రమాల ద్వారా సాంకేతికత వినియోగించుకోవడం అభినందనీయమని బృందం సభ్యులు పేర్కొన్నారు.
ఇవీ చదవండి: