పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో గత ఏడాది జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై ఎస్సెస్సీ, ఇంటర్ బోర్డులు, సీజీజీ, టీఎస్టీఎస్ అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు.
పరీక్షలు పకడ్బందీగా జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని స్పష్టం చేశారు. గత ఏడాది జరిగిన తప్పులు మళ్లీ జరగరాదన్న సీఎస్... త్రిసభ్య కమిటీ సిఫార్సులను ఎస్సెస్సీ, ఇంటర్ బోర్డులు పూర్తిగా అమలు చేయాలని చెప్పారు. అవసరమైతే అదనపు చర్యలు చేపట్టాలని సూచించారు.
విద్యార్థులు ఇబ్బందులు పడొద్దు..
విద్యార్థుల జవాబుపత్రాలు దిద్దే ప్రతి ఒక్కరికీ సమగ్ర శిక్షణ ఇచ్చి సాధారణంగా దొర్లే పొరపాట్లపై అవగాహన కల్పించాలని సోమేశ్ కుమార్ తెలిపారు. విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బందులు పడకూడదని... త్రిసభ్య కమిటీ నివేదిక మేరకు మూల్యాంకన కేంద్రాల్లో అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థుల ఫిర్యాదుల కోసం ఆన్లైన్ పరిష్కార విధానం ఉండాలని, సందేహాలు ఉన్న విద్యార్థులు వెబ్సైట్ను సంప్రదించే వెసులుబాటు ఉండాలని సీఎస్ తెలిపారు.
క్యాలెండర్ రూపొందించాలి..
అన్ని జిల్లాల్లోనూ సహాయక కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రవేశాల మొదలు ఫలితాల వెల్లడి వరకు క్యాలెండను రూపొందించాలన్న సోమేశ్ కుమార్... లోపాలకు ఆస్కారం లేకుండా ఐటీ మాడ్యూళ్లను పూర్తిస్థాయిలో పరీక్షించాలని సూచించారు. పరీక్షల నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లను అధికారులు వివరించారు. మార్చి 4 నుంచి 23 వరకు జరిగే ఇంటర్ పరీక్షలకు 9 లక్షల 65 వేల మంది విద్యార్థులు... మార్చి 19 నుంచి ఏప్రిల్ 6 వరకు జరిగే పదో తరగతి పరీక్షలకు 5 లక్షల 8 వేల మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు.
ఇవీ చూడండి: 'తుదితీర్పు వచ్చే వరకు నోటిఫికేషన్ విడుదల చేయొద్దు'