జాతీయ నూతన విద్యావిధానానికి సంబంధించి రాష్ట్రంలో విద్యారంగా అభివృద్ధి, పటిష్ఠతకు దోహదపడే అంశాలపై ముసాయిదా నివేదిక రూపొందించాలని సీఎస్ ఎస్కే జోషి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. విద్యారంగంపై ఉన్నతాధికారులతో సచివాలయంలో సీఎస్ సమీక్ష నిర్వహించారు.
నూతన విధానానికి సంబంధించి స్కూల్ కాంప్లెక్స్‌లు, విశ్వవిద్యాలయాలు, కళాశాలల హేతుబద్ధీకరణ, మూడు నుంచి ఆరేళ్ల పిల్లలకు విద్య అందించడం, ఒకేషనల్ శిక్షణ, పరీక్షల నిర్వహణ, కరికులం ఫ్లెక్సీబిలిటీ, ఉన్నత విద్యలో మల్టీడిసిప్లినరీ ఇనిస్టిట్యూషన్స్, సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ ఏర్పాటు, ఉద్యోగ అవకాశాలు తదితర అంశాలపై చర్చించారు. ప్రాథమిక విద్యకు సంబంధించి అంగన్వాడీ కేంద్రాలను వినియోగించి అవసరమైన శిక్షణను అందించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్ తెలిపారు.
ఒకేషనల్ శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందాలని సూచించారు. పరిశోధనలకు ప్రాముఖ్యతనివ్వాలని అన్నారు. విద్యారంగానికి సంబంధించి జిల్లా కలెక్టర్లు తీసుకోవాల్సిన వార్షిక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సీఎస్ ఆదేశించారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కోర్సుల రూపకల్పన చేయాలన్నారు. విశ్వవిద్యాలయాలను పరిశ్రమలతో అనుసంధానించడంతో పాటు పరిశోధనకు ప్రాధాన్యత ఉండాలని చెప్పారు. నిపుణులు, కన్సల్టెన్సీ సేవలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, మానవ వనరులు సద్వినియోగం చేయాలని సీఎస్ అన్నారు.
ఇవీ చూడండి: కోటుల్లో గోనె సంచి కోటు వేరయా