Crowd at Aadhaar Centers for Aadhaar Update : గ్రేటర్ హైదరాబాద్‌లో మీ-సేవ కేంద్రాలు, ఆధార్ సేవా కేంద్రాలు గత 10 రోజుల నుంచి కిక్కిరిసిపోతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం(Congress) ప్రకటించిన ఆరు గ్యారంటీలకు ఆధార్ కార్డును కీలకం చేసింది. ఆ పథకాలకు దరఖాస్తు సమర్పించాలంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా జోడించాల్సి ఉంది. దీంతో నగరవాసులు పెద్ద సంఖ్యలో తమ ఆధార్ కార్డులో మార్పులు చేర్పుల కోసం ఆధార్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు.
మీ ఫోన్లో mAadhaar ఉందా? - ఈ యాప్‌తో ఎన్నో ఉపయోగాలు!
నగరవ్యాప్తంగా దాదాపు 50 ఆధార్ నమోదు ఏజెన్సీలుండగా 2 ఆధార్ సేవా కేంద్రాలు అధికారికంగా పనిచేస్తున్నాయి. అయినా సరే ఏ మాత్రం సరిపోవడం లేదు. మీ-సేవలాంటి ఏజెన్సీల వద్ద రోజుకు 100 మందికి మాత్రమే ఆధార్‌లో చేర్పులు మార్పులు చేస్తున్నారు. ఆధార్ సేవా కేంద్రాల్లో మాత్రం రోజుకు వెయ్యి మందికి అవకాశం కల్పిస్తున్నారు. అందులో కొత్త కార్డులతో పాటు ఫోన్ నెంబర్ జత చేయడం, చిరునామా మార్పునకు అవకాశం ఇస్తున్నారు.
Public rush at Aadhaar Centers : తెలంగాణ రాష్ట్రం వచ్చినా ఇప్పటికీ చాలా మంది ఆధార్ కార్డులు ఆంధ్రప్రదేశ్ పేరుతోనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డులో చాలా సార్లు మార్పు చేసేందుకు అవకాశం ఇచ్చినా నగరవాసులు పట్టించుకోలేదు. ఇప్పుడు అభయహస్తం ఆరు గ్యారంటీల(Six Guarantess) పథకాల్లో లబ్దిపొందాలంటే వారంతా ఖచ్చితంగా తెలంగాణ పేరుతో చిరునామా మార్చుకోవాల్సి ఉంటుంది. దీంతో కోడి కూతకంటే ముందే జనం ఆధార్ సెంటర్లకు పరుగులు తీస్తూ బేజార్ అవుతున్నారు. వారం పది రోజుల నుంచి ఆధార్ సెంటర్లన్నీ జనంతో కిక్కిరిసిపోతున్నాయి. వేలి ముద్రలు, ఐరిష్ అప్డేట్ కోసం తప్పనిసరిగా రావాల్సి ఉండటంతో రోజువారీ కూలి పనిచేసుకునే వారికి ఇబ్బందులు తప్పడం లేదు.
అధికారం కోల్పోయినా బీఆర్ఎస్ నేతల వైఖరి మారలేదు : శ్రీధర్ బాబు
అలాగే చిరునామా మార్పు, ఫోన్ నెంబర్ జత చేయడం కోసం ఆన్ లైన్ లో చెసుకునే వెసులుబాటు ఉన్నా సాంకేతిక కారణాల వల్ల ఆధార్ నమోదు కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. వనస్థలిపురం మీ-సేవ కేంద్రం వద్ద రోజుకు 200 నుంచి 300 మంది బారులు తీరి ఉంటున్నారు. క్యూలైన్లలో నిల్చునే ఓపిక లేకపోవడంతో చెప్పులను వరుసలో పెట్టి టోకన్ల కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే ముసారాంబాగ్ మెట్రో స్టేషన్‌లోని ఆధార్ సేవా కేంద్రం వద్ద కూడా నిత్యం జనం రద్దీ కనిపిస్తోంది. ఈ కేంద్రంలో పూర్తిగా ఆధార్‌కు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరిస్తుంటారు.
దీంతో నగరంలోని చాలా ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి రావడంతో ముసారాంబాగ్ మెట్రో స్టేషన్ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డు తప్పనిసరి చేయడంతో నమోదు కేంద్రాలను పెంచి సమస్యను పరిష్కరించాలని నగరవాసులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రోజుల తరబడి తిరుగుతూ ఆర్థికంగా నష్టపోతున్నామని, సత్వరమే తగినన్ని కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
మంత్రి పొన్నంని కలిసిన అద్దె బస్సుల యజమానులు - సమస్యలు పరిష్కరించాలంటూ వినతిపత్రం