ఈ ఏడాది సెప్టెంబరు, అక్టోబరులో కురిసిన అధిక వర్షాలకు... తెలంగాణలో వ్యవసాయ పంటలేమీ దెబ్బతినలేదని కేంద్రం పరోక్షంగా స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 15 రాష్ట్రాల్లో కోటీ 60 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా నివేదికను కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ వెల్లడించింది.
రైతులకు అందని పరిహారం
కేంద్రం ప్రకటించిన జాబితాలో తెలంగాణ పేరు లేదు. రెండున్నర లక్షల ఎకరాల పంటలు నీట మునిగి దెబ్బతిన్నట్లు అక్టోబరు చివరిలో వ్యవసాయశాఖ తెలిపింది. దెబ్బతిన్న పంటలను వెంటనే పరిశీలించి పంట బీమా కంపెనీలకు సమాచారం ఇవ్వాలని జిల్లా వ్యవసాయాధికారులకు ఆదేశించింది. పంట దెబ్బతిన్న 72 గంటల్లోగా బీమా కంపెనీల అధికారులు వచ్చి చూసి నష్టపోయిన రైతులకు తక్షణ పరిహారంగా 25శాతం చెల్లించాలి. ఇదేమీ జరగనందున రైతులకు ఎలాంటి పరిహారం అందలేదు.
దక్కని గిట్టుబాటు ధర
ఖరీఫ్ సీజన్‌లో జూన్, జులైలో వర్షాలు లేక పంటలు ఎండిపోయాయి. ఆగష్టు, సెప్టెంబరు, అక్టోబరులో అధిక వర్షపాతంతో పంటలు నీటమునిగాయి. సిద్ధిపేట జిల్లాలో మొక్కజొన్న కంకుల్లోకి నీరు చేరి నల్లగా మారి.. రైతులకు ధర దక్కలేదు. పత్తి పూత రాలిపోవడమే కాకుండా దూది నల్లగా మారిపోయి గిట్టుబాటు ధరలు లభించలేదు. సిద్ధిపేట, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్ వంటి జిల్లాల్లో ఈ కారణంగానే నెల రోజులుగా మార్కెట్‌కు వస్తున్న పత్తికి... క్వింటాల్‌కు 3నుంచి 4వేల రూపాయలకు మించి పలకడం లేదు.
నష్టాలన్నింటినీ కేంద్రానికి నివేదిస్తే... తక్షణ సాయం అందేదని రైతులు వాపోతున్నారు. పంటల నష్టం వివరాలను రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖకు ఇచ్చామన్న వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారధి.. కేంద్రానికి వారు పంపలేదని తెలిపారు. రాష్ట్ర విపత్తుల సాయం నిధి నుంచి సాయం చేయడానికి అవకాశం ఉందని... ప్రభుత్వానికి నివేదిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చూడండి: రూ.100 లంచం అడిగిన అధికారులపై సీబీఐ కేసు