Heart Surgeries for Children in Nims Hospital: హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో 9మంది చిన్న పిల్లలకు చేపట్టిన క్లిష్టమైన గుండె శస్త్ర చికిత్సలు విజయవంతమయ్యాయి. ఇందుకోసం నిమ్స్ కార్డియో థొరాసిక్ సర్జరీ విభాగం 6 రోజుల పాటు ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించింది. బ్రిటన్‌లో స్థిరపడిన ప్రవాస భారతీయ వైద్యుడు డాక్టర్ రమణ ధన్నపునేని నేతృత్వంలో 10మంది వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది ఈ సర్జరీలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు మానవీయకోణంలో చిన్నారుల శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు.
తొలిసారిగా చిన్న పిల్లలకు గుండె సర్జరీ: భవిష్యత్‌లో నిమ్స్ ప్రపంచస్థాయి కార్డియో థొరాసిక్ సర్జరీ కేంద్రంగా మారుతుందని యూకే వైద్యులు అభిప్రాయపడ్డారు. బ్రిటన్ వైద్య బృందంతో పాటు నిమ్స్ ఇంఛార్జి డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి ఈ వర్క్‌షాపులో పాల్గొన్నారు. సాధారణంగా దేశ రాజధానిలోని ఎయిమ్స్‌లో విదేశీ వైద్య నిపుణుల ఆధ్వర్యంలో క్లిష్టమైన శస్త్ర చికిత్సలు జరుగుతుంటాయి. ఆ తరహాలోనే తొలిసారిగా హైదరాబాద్ నిమ్స్‌లో చిన్న పిల్లలకు గుండె సర్జరీలు నిర్వహించారు.
ప్రాణదానం చేసిన వైద్యులకు ధన్యవాదాలు: ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో లక్షల రూపాయల వ్యయంతో నిర్వహించే ఈ శస్త్ర చికిత్సలను ప్రభుత్వం నిమ్స్‌లో ఉచితంగా చేపట్టింది. ఆపరేషన్ల కోసం పేద కుటుంబాలకు చెందిన చిన్నారులను ప్రభుత్వం ఎంపిక చేసింది. తమ పిల్లలకు ప్రాణదానం చేసిన వైద్యులు, ప్రభుత్వానికి తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు.
నిమ్స్‌లో అత్యాధునిక వైద్య చికిత్సలు: రాష్ట్రంలో ఏటా 5,400 పిల్లలు గుండె లోపాలతో పుడుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వీరిలో 1000 మందికి శస్త్ర చికిత్స అవసరం అవుతోంది. ఆర్థిక వెనుకబాటుతనం వల్ల సరైన వైద్యం అందక కొందరు చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి వారికి మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో నిమ్స్‌లో ప్రభుత్వం అత్యాధునిక వైద్య చికిత్సలు అందుబాటులోకి తెస్తోంది.
నిమ్స్‌లో వర్కషాప్: ఈ క్రమంలోనే నిమ్స్ విస్తరణకు కూడా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే కొత్త బ్లాక్ ఏర్పాటు కోసం 32 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రభుత్వం నిమ్స్‌కు కేటాయించింది. త్వరలో మరో 2వేల పడకలు అందుబాటులోకి తేనుంది. వైద్య ప్రమాణాలు మెరుగుపర్చేందుకు నిమ్స్‌లో ప్రత్యేకంగా గుండె శస్త్ర చికిత్సల వర్క్‌షాప్ నిర్వహించినట్లు డాక్టర్లు తెలిపారు.
"హైదరాబాద్ నిమ్స్‌లో చిన్నపిల్లల గుండె శస్త్రచికిత్సలు నిర్వహించే అవకాశం నాకు లభించడం గౌరవంగా ఉంది. నిమ్స్ వైద్యులు, నర్సులు, మెడికల్ సిబ్బంది చాలా ఉత్సాహంగా ఈ వర్క్‌షాపులో పాల్గొన్నారు. గుండె శస్త్రచికిత్సల నిర్వహణలో యూకేలో మేం సాధించిన నైపుణ్యాలు, అనుభవాల్ని నిమ్స్ వైద్యులతో పంచుకున్నాం. ఇది పిల్లల గుండె సమస్యల చికిత్సను మరింత మెరుగుపరుస్తుందని భావిస్తున్నా."- డా.సుజాన, హృద్రోగ వైద్యురాలు, బ్రిటన్
ఇవీ చదవండి: