Suspicious Lockup Death In Hyderabad: పోలీస్ విచారణలో పాత నేరస్తుడు మృతి చెందడం కలకలం రేపింది. ఉత్తర మండలం పరిధిలోని తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ఎల్బీనగర్‌లోని భూపేశ్‌నగర్‌కు చెందిన పాత నేరస్తుడు చిరంజీవి సెల్‌ఫోన్ దొంగతనం కేసులో.. పోలీసులు అతడిని తీసుకొచ్చి విచారిస్తున్న క్రమంలో మృతి చెందాడు. చిరంజీవి అస్వస్థతకు గురై మృతి చెందినట్లు పోలీసులు చెబుతుండగా.. పోలీసులే చిరంజీవిని కొట్టడం వల్ల మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు.
ఎల్బీనగర్‌లోని భూపేశ్‌నగర్‌కు చెందిన చిరంజీవి పాత నేరస్తుడు. ఇతనిపై గతంలో పలు పాత కేసులు నమోదై ఉన్నాయి. ఇళ్లల్లో చోరీలు, గొలుసు దొంగతనాలు ఇతర కేసులలో నిందితుడిగా ఉన్నాడు. అయితే తుకారం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెల్‌ఫోన్ చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించి.. తనని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అతడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి విచారిస్తున్న క్రమంలో అస్వస్థతకు గురయ్యాడని పోలీసులు చెబుతున్నారు. చిరంజీవిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి.. అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో పట్టుబడిన దొంగ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
కుటుంబ సభ్యలుల ఆందోళన: కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని.. చిరంజీవిని పోలీసులు అదుపులోకి తీసుకుని కొట్టడం వల్లనే మృతి చెందాడని ఆరోపించారు. అతని మృతదేహాన్ని తీసుకోవడానికి నిరాకరించి.. తమకు న్యాయం చేయాలంటూ బంధువులు గాంధీ మార్చురీ వద్ద ఆందోళనకు దిగారు. ఒక దశలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ గాంధీ ఆసుపత్రి మార్చురీ వద్ద ప్రధాన రహదారిపై బైఠాయించారు. దీంతో రహదారికి ఇరువైపులా పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు మృతుని బంధువులకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తూ.. వారందరినీ తిరిగి గాంధీ మార్చురీ వద్దకు తీసుకెళ్లారు.
ప్రభుత్వం న్యాయం చేయాలి: అకారణంగా పోలీసులు తన భర్తను చంపారంటూ మృతుని భార్య ఆవేదన వ్యక్తం చేసింది. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని లేకుంటే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని కుటుంబ సభ్యులు హెచ్చరించారు. అతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారని తండ్రి చనిపోవడంతో వారికి దిక్కు ఎవరని బంధువులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తన కుటుంబ సభ్యుల నుంచి లిఖితపూర్వక ఫిర్యాదు అందకపోవడంతో పోలీసులు ఇంకా మృతి చెందిన చిరంజీవి మృతదేహానికి పోస్టుమార్టం ప్రక్రియ ప్రారంభించలేదు. తమకు న్యాయం జరిగేంత వరకు పోస్టుమార్టం ప్రక్రియ జరగనివ్వమని.. ఆందోళనలు కొనసాగిస్తామని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
ఇవీ చదవండి: