చార్మినార్ వద్ద పాదచారుల ప్రాజెక్టు పనులతో కట్టడానికి ఏ విధమైన ప్రమాదంలేదని జీహెచ్ఎంసీ అధికారులు స్పష్టం చేశారు. ఇటీవల ఈ కట్టడం పై భాగంలోని మినార్ పాక్షికంగా కూలింది. దీనిని చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ముషారఫ్ అలీ, చార్మినార్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు.
పాదచారుల ప్రాజెక్టు వల్లే కూలలేదు
చార్మినార్‌పై భాగంలోని మినార్ పాక్షికంగా కూలడానికి చార్మినార్ పాదచారుల పనులకు ఏ విధమైన సంబంధం లేదని ముషారఫ్ అలీ స్పస్టం చేశారు. ప్రభుత్వం చేపట్టిన పాదచారుల ప్రాజెక్టు పనులతో చార్మినార్ కట్టడానికి పూర్తిస్థాయిలో భద్రత ఏర్పడటమే కాకుండా.. పరిసర ప్రాంతాల సుందరీకరణ జరుగుతోందని ముషారఫ్ అలీ తెలిపారు.
చార్మినార్ మరమ్మతులో నిర్లక్ష్యం..!
ఇటీవల జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చారిత్రక మోజంజాహి మార్కెట్, కులి కుతుబ్ షా సమాధుల పునరుద్ధరణకు సాంప్రదాయబద్దంగా సున్నపురాయి మిశ్రమాన్ని సమ పాళ్లలో ఉపయోగించామని వెల్లడించారు. ఈ రెండు ప్రాజెక్టుల వద్ద జరిగినట్లుగా శాస్త్రీయ పద్ధతిలో చార్మినార్ మినార్ పునరుద్ధరణ జరగలేదని అభిప్రాయపడ్డారు.
చారిత్రక కట్టడం వద్ద కాలుష్యానికి చెక్
ప్రతిరోజు చార్మినార్ దగ్గర నుంచి 10 వేలకుపైగా బస్సులు, వాహనాలు రాకపోకలు సాగించేవని సీపీపీ ప్రాజెక్టుతో వాహనాల దారి మళ్లించి చార్మినార్‌ను కాలుష్యం బారిన పడకుండా నిరోధించామని స్పష్టం చేశారు. లాడ్ బజార్ మార్గాన్ని అసఫ్‌జాహి సాంప్రదాయాన్ని తెలిపేలా అభివృద్ధి పనులను చేపట్టామని జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ ముషారఫ్ అలీ పేర్కొన్నారు.
మూసీపై మరో వంతెన
ఇక్కడ ఉండే వీధి వ్యాపారులకు ప్రత్యామ్నయ ఏర్పాట్లలో భాగంగా సాలర్‌జంగ్ మ్యూజియం ఎదురుగా మూసీనదిపై దాదాపు 200 కోట్ల వ్యయంతో ప్రత్యేక వంతెన నిర్మించనున్నామని తెలిపారు.
చార్మినార్ చుట్టూ బొల్లాడ్ల ఏర్పాటు
అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయ పరిసరాల్లోకి వాహనాలు రాకుండా బొల్లాడ్లను ఏర్పాటు చేశారు. ఇదే తరహాలో జీహెచ్ఎంసీ అధికారులు చార్మినార్‌కు దారితీసే నాలుగు మార్గంలోనూ బొల్లాడ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మొదటి దశ పనుల్లో భాగంగా గుల్జార్ హౌస్, మక్కా మజీద్ మార్గంలో ప్రారంభించారు. రెండో దశ పనులను లాడ్ బజార్, సర్దార్ మహల్ మార్గాల్లో చేపట్టనున్నారు. మొత్తం 125 బొల్లాడ్లను 2 కోట్ల 38 లక్షల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 28 బొల్లాడ్‌లు ఆటోమెటిక్ హైడ్రాలిక్ లని అధికారులు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: తగ్గిన వర్షపాతం... అడుగంటిన భూగర్భజలం..