కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి మొండి చేయి చూపిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. రాష్ట్ర విభజన హామీలను తుంగలో తొక్కి, కేంద్ర పథకాలకు బడ్జెట్‌లో ఎలాంటి నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. ఇప్పటికైనా భాజపా, తెరాస, కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు.
ఎన్నికల రాష్ట్రాలకే నిధులా? :
కేంద్రం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి ఎలాంటి నిధులు కేటాయించలేదని విమర్శించారు. ఎంఎంటీఎస్ పొడిగింపు, మెట్రో రెండో దశకు నిధులు కేటాయించకుండా నిరాశ మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రకటించిన మాచర్ల-నల్గొండ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు కేటాయించకుండా అన్యాయం చేసిందన్నారు. ఎన్నికలు జరగబోయే తమిళనాడుకు మాత్రం మెట్రో పొడిగింపుకు రూ.63 వేల కోట్లు ప్రకటించి రాజకీయంగా లబ్ధి పొందాలని భాజపా ప్రయత్నిస్తోందన్నారు.
ఎంపీలు గళమెత్తాలి :
కేంద్రం చేస్తున్న అన్యాయంపై రాష్ట్ర ఎంపీలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయమన్నారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరిగుతుంటే ముఖ్యమంత్రి నోరు మెదపడం లేదని తెలిపారు. ఇప్పటికైనా భాజపా, తెరాస ఎంపీలు కేంద్రం చేస్తున్న అన్యాయంపై పోరాడాలని తమ్మినేని వీరభద్రం హితవు పలికారు. ముఖ్యమంత్రి పోరాట పటిమను చూపి తెలంగాణకు రావాల్సిన నిధులపై గళం విప్పాలని ఆయన విజ్ఞప్తి చేశారు.