స్వాతంత్రోద్యమం, తెలంగాణ సాయుధ పోరాటానికి.. భాజపాకు ఎలాంటి సంబంధం లేదని సీపీఎం(CPM) పొలిట్ బ్యూరో సభ్యులు బీ వీ.రాఘవులు స్పష్టం చేశారు. దేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం కోసం పోరాటం చేసింది కమ్యూనిస్టులు మాత్రమేనని పేర్కొన్నారు. తెలంగాణ సాయిధ రైతాంగ పోరాట స్ఫూర్తితో దేశ వ్యాప్త రైతు ఉద్యమానికి మద్దతుగా సీపీఎం హైదరాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో 'రెడ్ షర్ట్స్ వాలంటీర్స్ రెడ్ క్లాత్' ప్రదర్శన నిర్వహించారు.
హైదరాబాద్ సంస్థానాన్ని విమోచనం చేయడంలో ముఖ్య పాత్ర పోషించింది కమ్యూనిస్టులు. ఎంతో మంది త్యాగాలు చేశారు. ఆ విషయాన్ని మేము సగర్వంగా చెప్పుకుంటాం. నిర్మల్లో సభ పెడుతున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. నిజాం, స్వాతంత్య్ర పోరాటంలో భాజపా ఎక్కడ పాల్గొందో చెప్పాలి. ఏ ధర్నా, సభలోనైనా మీ పూర్వీకులు ఉన్నారా అనేది చెప్పాలి. బీవీ రాఘవులు, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు
హిందూ, ముస్లింల పోరాటంగా చరిత్రను భాజపా నేతలు వక్రీకరిస్తున్నారని రాఘవులు మండిపడ్డారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్కు వరకు జరిగిన ప్రదర్శనలో బీవీ.రాఘువులు పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు దమ్ముంటే నిర్మల్ బహిరంగ సభ వేదికగా భాజపా, ఆర్‌ఎస్‌ఎస్.. స్వాతంత్రోద్యమం, నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఎక్కడ పాల్గొన్నాయో చెప్పాలని రాఘవులు డిమాండ్ చేశారు. దేశభక్తి, ఐక్యత గురించి మాట్లాడే అర్హత భాజపా నేతలకు లేదని ఎద్దేవా చేశారు. ఈ ప్రదర్శనలో సీపీఎం శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి.
ఇదీ చదవండి: Minister KTR : 'జూట్ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా ఒప్పందం'