నిస్వార్థ ప్రజా సేవకుడు గుండా మల్లేశ్ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. గుండా మల్లేశ్ నాలుగు పర్యాయాలు ఎమ్యెల్యేగా గెలిచి... అసెంబ్లీలో ఎస్సీ, బడుగు, బలహీన వర్గాల వాణిని వినిపించి, నిస్వార్థ ప్రజా సేవకుడిగా నిలిచారని కొనియాడారు. హైదరాబాద్ మజ్దూర్ భవన్లో సీపీఐ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్యెల్యే, ప్రముఖ కార్మిక నాయకుడు గుండా మల్లేశ్ సంస్మరణ సభ... ఎస్సీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. ముందుగా గుండా మల్లేశ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నేతలు, కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు.
బొగ్గుగని కార్మికునిగా ఉద్యోగంలో చేరి, సింగరేణి కాలేరీస్ వర్కర్స్ యూనియన్ నాయకుడిగా ఎదిగరని చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. అంచెలంచెలుగా సీపీఐ జాతీయ సమితి సభ్యులుగా, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ఉపాధ్యక్షులుగా, నాలుగు సార్లు ఎమ్యెల్యేగా సేవలందించి... సీపీఐకి విధేయుడిగా ఉంటూ అనేక పోరాటాలు గుండా మల్లేశ్ నిర్వహించడాన్ని గుర్తు చేశారు. ప్రజాజీవితంలోకి వచ్చినప్పటి నుంచి కార్మికులు, ముఖ్యంగా వ్యవసాయ కార్మికులను సంఘటితపరిచారని పేర్కొన్నారు. కమ్యూనిస్టు విలువలకు కట్టుబడిన మహోన్నత వ్యక్తి గుండా మల్లేశ్ అని ఆయన లేని లోటు తీరదని... వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని చాడ వెంకట్ రెడ్డి తెలియజేశారు.