విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ప్రతిపాదనను మోదీ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. కర్మాగారం ప్రైవేటీకరణ చేయడమంటే తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బ తీయడమేనని విమర్శించారు. ఫ్యాక్టరీ స్థాపనలో అనేకమంది యోధుల త్యాగాలు, ప్రజల ఆందోళనలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో 'విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు' అన్న నినాదంతో ఉవ్వెత్తున విద్యార్థులు, ప్రజలు ఆందోళన నిర్వహించారని చాడ తెలిపారు. ఫ్యాక్టరీ స్థాపనకు అనేక మంది నాయకులు దీక్షలు చేపట్టారని పేర్కొన్నారు. సీపీఐ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారని గుర్తు చేశారు.
ఉత్తరాంధ్ర వారికి..
ఆ సమయంలో నాటి ప్రధాని ఇందిరా గాంధీ.. ఉక్కు ఫ్యాక్టరీ స్థాపనకు అంగీకరించారని తెలిపారు. కర్మాగారం ఏర్పాటు చేయడంతో లక్షలాది కార్మికులకు, ఉద్యోగులకు ఉపాధి లభించిందన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల వారికి ఎంతో ఉపయోగపడిందని వెల్లడించారు.
ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను సీపీఐ తెలంగాణ రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండిస్తుందని ప్రకటించారు. కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టే ఆందోళనలకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమబాట పడతాం'