కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆలోచనను వెంటనే విరమించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంపై ఆయన హైదరాబాద్లో మాట్లాడారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ పరం చేయడం అంటే ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతీయడమేనని మండిపడ్డారు. 32 మంది బలిదానం చేసుకున్న తరువాత ఏర్పడ్డ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత అన్నీ పార్టీలపై ఉందన్నారు.
కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తుంది..
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చొరవ తీసుకొని ఉక్కు పరిశ్రమ ప్రైవేట్ పరం కాకుండా మోదీతో మాట్లాడాలని ఆయన సూచించారు. మోదీ ప్రభుత్వం అన్నీ ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేయాలనే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ప్రైవేట్ పరం చేస్తే పెట్టుబడులు ఎక్కువగా వస్తాయని ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
దేశ ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తుందని చాడ ఆక్షేపించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి తెలంగాణ సీపీఐ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతుందన్నారు. త్వరలోనే క్షేత్రస్థాయి ఉద్యమంలో పాల్గొంటామని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: అపార్టుమెంట్లో పేలిన ఏసీ.. స్వల్ప అగ్ని ప్రమాదం