Karthika Puranam 10th Day In Telugu : పరమ పవిత్రమైన కార్తిక మాసంలో నిరాంటంకంగా కొనసాగుతున్న కార్తిక పురాణంలో పదో అధ్యాయంలో వశిష్ఠుడు జనకునితో చెప్పిన అజామిళుని పూర్వజన్మ వృత్తాంతం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
వశిష్ట జనకుల సంవాదం
వశిష్ఠుడు పదోరోజు కథను ప్రారంభించబోతున్న సమయంలో జనకుడు వశిష్ఠులవారితో "ఓ మునిశ్రేష్ఠా! ఈ అజామిళుడు ఎవరు? అతని పూర్వజన్మ వృత్తాంతమేమిటి ? పూర్వజన్మలో ఇతను ఎటువంటి పాపములు చేసెను. విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుని వెళ్లిన తరువాత ఏమి జరిగింది? దయతో వివరించండి" అని ప్రార్ధించగా ఆ మునిశ్రేష్ఠుడు జనకునితో ఇలా పలికెను.
దివ్యదృష్టితో అజామిళుని గురించి తెలుసుకున్న యముడు
"వశిష్ఠుడు జనకునితో ఓ జనకా! విష్ణుదూతలు అజామిళుని వైకుంఠమునకు తీసుకొని వెళ్ళిన తరువాత యమదూతలు నరకమునకేగి యమధర్మరాజుతో "ప్రభూ! మేము అజామిళుని తీసుకురావడానికి వెళ్లగా అక్కడకు విష్ణుదూతలు వచ్చి వానిని వైకుంఠమునకు తీసుకునివెళ్ళారు" అని భయపడుతూ చెప్పారు. అప్పుడు యముడు ఆశ్చర్యముతో "ఔరా!" ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇందుకు కారణమేమై ఉంటుందని తన దివ్యదృష్టితో చూడగా "నారాయణ" మంత్రం మహిమ వల్లనే అజామిళునికి వైకుంఠ ప్రాప్తి కలిగిందని గ్రహించి ఆహా! నారాయణ మంత్రమెంత గొప్పది! తెలిసిగాని తెలియకగాని స్మరిస్తే ఎంతటి పుణ్యం అని అనుకున్నాడు.
అజామిళుని పూర్వజన్మ వృత్తాంతం
శివాలయ అర్చకుని కథ
అజామిళుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకానొక శివాలయములో అర్చకుడుగా ఉండేవాడు.అతడు తన అపురూపమైన అందము చేతను, సిరిసంపదల చేతను గర్విష్ఠియై, వ్యభిచారియై శివారాధన చేయక, శివాలయము యొక్క ధనమును అపహారించుచు శివునికి ధూప దీప నైవేద్యములు పెట్టక, దుష్ట సహవాసములు మరిగి విచ్చలవిడిగా జీవిస్తూ ఉండేవాడు. ఒక్కొక్కసారి శివుని కెదురుగా పాదములు పెట్టి పడుకునేవాడు.
బ్రాహ్మణ దంపతుల కథ
శివాలయ అర్చకునికి ఒక పేద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండెడిది. ఆమె ఎంతో అందమైనది. అందుచేతనే ఆమె భర్త ఆమెను ఏమి అనకుండా పగలంతా భిక్షాటన చేసి ఊరూరూ తిరుగుతూ ఏదో వేళకు ఇంటికి వచ్చేవాడు. ఒకనాడు అతను పొరుగూరికి వెళ్లి యాచన చేసి పెద్ద బియ్యం మూటతో, కూరల సంచితో వచ్చి, నాకు చాలా ఆకలిగా ఉంది అన్నం పెట్టమని అడుగగా, ఆమె అతనిని చీదరించుకుని, విటునిపై మనసుతో భర్తను కన్నెత్తి కూడా చూడలేదు. అంతటితో అతను ఆమెను కోపగించుకోగా, ఆమె అతనిని కర్రతో కొట్టి బయటకు నెట్టివేసింది.
విరక్తితో దేశాలు పట్టిపోయిన బ్రాహ్మణుడు
అంతట ఆ బ్రాహ్మణుడు భార్యపై విసుగు చెంది దేశాలు పట్టిపోయాడు. ఇక్కడ ఈమె మాత్రం విటులను ఆకర్షించడమే పనిగా పెట్టుకుని నీచమైన జీవితం గడపసాగింది. కామాంధురాలై శివాలయ అర్చకుని కూడా వశపరచుకుంది.
బ్రాహ్మణ స్త్రీ పశ్చాత్తాపం
ఒకనాటి ఉదయం రాత్రంతా అర్చకునితో గడిపి ఇంటికి వచ్చిన తరువాత ఆమెలో పశ్చాత్తాపం మొదలైంది. ఒక కూలివాని పిలిచి కొంత ధనం ఇచ్చి తన భర్త జాడ తెలుసుకు రమ్మని పంపింది. కొన్ని రోజుల తర్వాత భర్త ఇంటికి రాగా అతనికెదురేగి పాదములపై పడి తనకు క్షమించవలసిందిగా ప్రార్ధించింది. అప్పటి నుంచి ఆమె తన మంచి ప్రవర్తనతో తన భర్త మనసు గెలుచుకుంది.
అర్చకుని అవసానదశ
కొంతకాలమునకు శివాలయ అర్చకునకు భయంకరమైన వ్యాధి సంక్రమించి మరణించెను. నరకానికేకిగిన అతడు ఎన్నో నరకబాధలు పొంది మరల సత్యవ్రతునికి కుమారునిగా అజామిళుడిగా పుట్టి కార్తీకమాసమున నదీస్నానం చేసి, దేవతార్చన చేసి ఉన్నందున అవసాన సమయమునందున 'నారాయణ' నామస్మరణ చేత వైకుంఠమునకేగెను.
బ్రాహ్మణ స్త్రీ మరు జన్మ వృత్తాంతం
బ్రాహ్మణుడి భార్యయగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను. అనేక యమబాధలు అనుభవించిన తరువాత ఒక మాలవాని ఇంట జన్మించెను. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమని తెలుసుకుని ఆ పిల్లను అడవిలో వదిలిపెట్టి వచ్చాడు. ఇంతలో దారినపోయే ఒక విప్రుడు ఆ పిల్ల ఏడుపు విని జాలిపడి తన ఇంటి దాసీకి పెంచమని ఇచ్చెను. ఆ పిల్లయే అజామిళుని ప్రేమించిన ఎరుకలపిల్ల. "ఇదీ వారి పూర్వజన్మ వృత్తాంతం"అని వశిష్ఠుడు జనకునితో చెప్పాడు.
కావున నిర్మలమైన మనసుతో శ్రీహరిని ధ్యానించి, దానధర్మములు చేసి, శ్రీహరి కథలను విని, కార్తిక మాస వ్రతము చేయడంవల్ల ఇహపర సుఖములను పొందెదరు. అని వశిష్ఠుడు జనకునితో చెబుతూ పదవరోజు కథను ముగించాడు. ఇతి స్మాందపురాణ కార్తిక మహాత్మ్యే దశమాధ్యాయ సమాప్తః ఓం నమః శివాయ!
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.