కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాపోరాటం చేపట్టాలని... ఇందుకు అన్ని ప్రాంతీయ, లౌకికవాద, రాజకీయ పార్టీలు ముందుకు రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి సూచించారు. తెలంగాణలోని తెరాస ప్రభుత్వం, ఏపీలోని వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లొంగిపోతే రాష్ట్ర అధికారాలు కూడా పోతాయని హెచ్చరించారు. ఇప్పటికే జీఎస్టీ నిధులను రాష్ట్రాలు అడుక్కునే పరిస్థితికి వచ్చాయన్నారు.
రైతులకు నష్టం కలిగించేలా పార్లమెంటులో అప్రజాస్వామికంగా... ఆమోదింపజేసుకున్న వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో హైదరాబాద్ హిమాయత్ నగర్‌లోని సత్యనారాయణరెడ్డి భవన్ ఎదుట నిరసన ప్రదర్శించారు. ఈ సందర్భంగా వ్యవసాయ బిల్లుల ప్రతులను చాడ వెంకట్ రెడ్డి తగులబెట్టారు.
![cpi state president chada venkat reddy protest against central government at himayathnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8886252_978_8886252_1600703746077.png)
రైతు వ్యతిరేక మోదీ ప్రభుత్వం నశించాలని... కార్పొరేట్ అనుకూల చట్టాల రద్దు, రైతుల వ్యతిరేక వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని నినాదాలు చేశారు. మోదీ ప్రభుత్వం కోటీశ్వరులకు కొమ్ము కాస్తోందని చాడ విమర్శించారు. కార్పొరేట్ చేతిలో సన్న, చిన్నకారు రైతులను బానిసలను చేసేందుకే వ్యవసాయ బిల్లును ప్రవేశపెట్టారని... వెంటనే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక చర్యలపై తాము సేవ్ ఇండియా సీపీ డెమొక్రసీ, సేవ్ నేషన్, సేవ్ సెక్యూలర్ నినాదాలతో ఉద్యమిస్తామని చాడ వెంకట్ రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: ఆ చట్టం విషయంలో దొంగే దొంగ అన్నట్లుగా ఉంది : చాడ