కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తూ రేపు హైదరాబాద్లో అఖిలపక్ష పార్టీలతో రౌంట్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి తెలిపారు. కరోనాకట్టడిలో.. వలస కార్మికులు, అసంఘటిత, చిరు వ్యాపారస్థులు, చేతివృత్తులకు సాయం అందించడంలో కేంద్రం ఘోరంగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో భాజపా ప్రభుత్వం తన అసలు ఎజెండా అయన ప్రైవేటీకరణ అమలుకు పూనుకుందని దుయ్యబట్టారు.
2020 విద్యుత్ సవరణ చట్టం, 50 బొగ్గు బ్లాకులు, వ్యవసాయరంగంలో కార్పొరేటీకరణ, రక్షణ, రైల్వేరంగాల్లో ప్రైవేటీకరణ చేపట్టిందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రాలు కేంద్రం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించాయన్నారు. తెరాస ప్రభుత్వం కూడా విద్యుత్, బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసేందుకు తీసుకున్న నిర్ణయాన్ని ఎండగట్టేందుకు కలిసివచ్చే లౌకిక, ప్రజాతంత్ర, వామపక్ష పార్టీలతో బుధవారం ఉదయం 11గంటలకు అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని ప్రకటించారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 1610 కరోనా పాజిటివ్ కేసులు