దేశ ప్రధాని నరేంద్రమోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలనుద్దేశించి కార్గిల్ స్ఫూర్తితో కరోనాతో పోరాడాలని మాట్లాడటం శోచనీయమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సరిహద్దుల్లో సైనికులు శౌర్యంతో దేశ రక్షణ కొరకు పోరాటం చేస్తారని పేర్కొన్నారు. కరోనాపై సైన్స్ ద్వారా పోరాటం చేయాలని... కొవిడ్ వచ్చింది మొదలు మాటలు తప్ప వైద్యానికి కేటాయించిన నిధులపై శ్వేతపత్రం ప్రకటించగలరా అని ప్రశ్నించారు. జీడీపీలో 1.9 శాతం వైద్యానికి కేటాయించే భారతదేశంతో పోల్చుకుంటే మనకన్నా పేద దేశాలైన బంగ్లాదేశ్ , శ్రీలంక కన్నా ఇది చాలా తక్కువే అన్నారు. ప్రపంచంలో కనిష్ట స్థాయిలో ఆరోగ్య రంగానికి ఖర్చు పెట్టే దీన పరిస్థితి... కరోనాతో పోరాడే సైన్స్ , వైద్యులు , వైద్య వ్యవస్థను బలపరచకుండా... కార్గిల్ యుద్ధం - దాని స్ఫూర్తితో కరోనాపై పోరాటం అని అశాస్త్రీయ పద్ధతిలో ప్రధాని ఉపన్యాసం ఇచ్చారని నారాయణ ఎద్దేవా చేశారు.
ప్రధాని మోదీ ప్రతి సామాజిక సమస్యను రాజకీయ ఉద్దేశంతో ఎన్నికల ఒరవడితోనే మాట్లాడుతున్నారని నారాయణ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కొవిడ్ అజెండాను పక్కన పడేశారని ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రేమో కొవిడ్ మహమ్మారి బారిన పడే ప్రజలను వదలి... మూడు రాజధానులు, ఎన్నికల కమిషనర్‌ను తొలగించడం... ప్రశ్నించిన వారిపై నిర్బంధ చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొవిడ్‌తో ఎంత మంది మరణించారో లెక్క చెప్పలేకపోతున్నారని విమర్శించారు. కరోనా టెస్టులను కూడా గోప్యంగా ఉంచి... సచివాలయాన్ని కూల్చడానికి సగం హైదరాబాద్‌లో నాకాబందీ ప్రకటించి పోలీస్ పహారాలో ఉంచడం చూస్తుంటే... చిత్తం శివుడిపైనా - చూపు ప్రసాదంపైనా అన్నట్టు అటు ప్రధాని, ఇటు ఇరువురు ముఖ్యమంత్రులు ప్రవర్తించడం సభ్యసమాజానికి సిగ్గుచేటని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: 'భాజపా కుట్రలను ప్రజలు తిరస్కరిస్తారు'