కేంద్ర ప్రభుత్వం గత ఏడేళ్లలో నిత్యావసర వస్తువుల ధరలను మూడు రెట్లు పెంచి కార్పొరేట్ శక్తులను పోషిస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ హిమాయత్‌నగర్‌లోని ఏఐటీయూసీ కార్యలయం ముందు ధర్నా నిర్వహించారు.
అంతర్జాతీయంగా లేని ధరలు కేవలం భారతదేశంలో మాత్రమే పెంచుకుంటూ పోతుందని విమర్శించారు. ధరల పెరుగుదలతో సామాన్యుడి జీవనం భారంగా మారిందన్నారు. పెంచిన ధరలు తగ్గించకపోతే... సీపీఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని చాడ హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో సీపీఐ జాతీయ నాయకులు అజీజ్ పాష, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బోస్ తదితరులు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.