రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టాల రూపకల్పనకు సీఎం కేసీఆర్ కృషి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రెవెన్యూ చట్టాలు నైజాం నవాబ్ కాలంలో రూపొందించారని... ఉమ్మడి రాష్ట్రంలో ఆ చట్టాలకు అనేక సవరణలు చేసినప్పటికీ అమలు కాలేదని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా భూవివాదాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వీఆర్వో నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు అవినీతి నిలయాలుగా మారాయని మండిపడ్డారు. మంచి ఉద్దేశంతో చేపట్టిన భూప్రక్షాళన... కాసుల పంటగా మారిందని విమర్శించారు. ఇటీవల లంచం తీసుకుంటూ పట్టుబడుతున్న ఘటనలే అవినీతికి అద్దం పడుతున్నాయని చాడా ఆగ్రహం వ్యక్తం చేశారు.