ఆలిండియా ట్రేడ్ కార్పొరేషన్ పిలుపునిచ్చిన బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. అన్ని రకాల వస్తూ సేవలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం...పెట్రోల్ డీజిల్‌ను తీసుకురాకుండా ఖజానాను నింపుకుంటుందని మండిపడ్డారు. జీఎస్టీ పరిధిలోకి చమురు ధరలు తీసుకు రాకపోవడం వల్ల.. ప్రజలపై అధిక పన్నుల భారం పడుతుందని ధ్వజమెత్తారు.
అంతర్జాతీయంగా పెట్రోల్ 32 రూపాయలకే లభిస్తుంటే.. కేంద్రం దానికి అదనంగా 36 రూపాయలు పన్నులు విధించి ప్రజల సొమ్ము దోచుకుంటుందని విమర్శించారు. రాష్ట్రాల సుంకాలు కలుపుకుని అసలు ధర కంటే మూడో వంతు అధిక ధరతో పెట్రోల్ డీజిల్ విక్రయిస్తున్నారని మండి పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా నిత్యవసర సరకుల ధరలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చాడ హెచ్చరించారు. గత పాలకులు సంపాదించిన ఆస్తులను.. అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడానికి ఆశగా చూస్తోందని ఆరోపించారు. రెండు లక్షల 52 వేల కోట్ల రూపాయలను ప్రైవేట్ రంగ సంస్థలకు కట్టబెట్టి.. ప్రభుత్వరంగ సమస్యలను కక్ష పూరితంగా నిర్వీర్యం చేయడానికి నరేంద్ర మోదీ పూనుకున్నారని మండిపడ్డారు.
ఇదీ చూడండి : తెరాస, భాజపాలకు ఓట్లు అడిగే హక్కు లేదు: ఉత్తమ్