నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు.. వామపక్షాలు, ప్రజాసంఘాలు, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు బలపరుస్తున్న అభ్యర్థిగా జయసారథి రెడ్డిని సీపీఐ ఎంపిక చేసింది. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో... ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి ఆయనకు బీ ఫారం అందజేశారు.
రాష్ట్రంలో విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ప్రశ్నించే గొంతుక కావాలని చాడ అన్నారు. జయ సారథి రెడ్డిని ప్రజల పక్షాన పోరాడే వ్యక్తిగా గెలిపించాలని కోరారు. నిరుద్యోగుల కల సాకారం కాలేదని, ఉద్యోగుల పీఆర్సీ సమస్య.. పరిష్కారానికి నోచుకోలేదని ఎమ్మెల్సీ అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు. మౌలిక సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అన్ని వర్గాలు సహకారం అందించి గెలిపించాలని కోరారు.
ఇదీ చదవండి: నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలి: కోదండరాం