లాక్డౌన్ వేళ కాలు బయటపెట్టేందుకే జంకుతున్న సమయాన.. వారు మాత్రం విధులకు హాజరు కావాల్సిన పరిస్థితి. కంటికి కనిపించని మహమ్మారిపై బయటకి కనిపించని యుద్ధం చేయడానికి వెళ్తున్న వీరులకు కన్నీటి తిలకం అద్ది పంపించారు కుటుంబ సభ్యులు. ఇంటికి ఏ విధంగా తిరిగొస్తారో తెలియకపోయినా... కన్నీటిని రెప్పమాటున దాచి.. ఉబికి వస్తున్న దు:ఖాన్ని పెదవికింద నొక్కిపెట్టి డ్యూటీకి వెళ్లిరండని పంపించారు పోలీసుల కుటుంబ సభ్యులు. చివరికి కరోనా మహమ్మారిపై జరిపిన పోరులో తమవారు అమరులయ్యారని తెలిసి... చివరకు ఆఖరు చూపు కూడా నోచుకోలేక.. వారి జ్ఞాపకాలతోనే కాలం గడుపుతున్నారు.
కరోనా మహమ్మారి విజృంభణ మొదలైన తొలినాళ్లలో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన 34మంది పోలీసు అమర వీరులకు ఘనంగా నివాళులర్పించారు. బషీర్‌బాగ్‌లోని సీపీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీపీ అంజనీ కుమార్, అదనపు సీపీ శిఖా గోయల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన బాధను తలచుకొని కొందరు విలపించగా..శిఖా గోయల్ వారిని భుజం తట్టి ఓదార్చారు.
ఇదీ చూడండి: కరోనాపై పోరాటంలో అమరులైన పోలీసులకు సీపీ, అధికారుల నివాళి