హైదరాబాద్ నగరంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను అధికారులు కంటైన్‌మెంట్ క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో 12 కంటైన్‌మెంట్ క్లస్టర్లు గుర్తించినట్లు సీపీ అంజనీకుమార్ తెలిపారు. ఈ క్లస్టర్ల పరిధిలో నివసించే వారికి నిత్యావసర సరుకులు, అవసరమైన ఔషధాలను ఎప్పటికప్పుడు అందించనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ వెల్లడించారు.
"నగరవ్యాప్తంగా 12 కంటైన్‌మెంట్ క్లస్టర్లను గుర్తించాం. సుమారుగా నాలుగు నుంచి ఏడు వేల మంది ప్రజలకు ఒక క్లస్టర్‌గా విభజించాం. ఈ కంటైన్‌మెంట్ డ్రైవ్ ప్రజల కోసమే. దీనికి అందరూ సహకరించాలని కోరుతున్నాను". - అంజనీకుమార్
"ప్రజలందరూ సహకరిస్తున్నారు. తొందర్లోనే ఈ ఆంక్షలు తొలగాలని కోరుకుంటున్నాను. మరో 14 రోజులు లాక్‌డౌన్ కొనసాగుతుంది. పాజిటివ్ కేసులున్న ఇళ్లు, కంటైన్‌మెంట్ ఏరియాలను పూర్తిగా నిషేధిస్తాము. వారికేం అవసరమున్నా మేమే అందిస్తాం". -లోకేశ్‌కుమార్
మల్లెపల్లిలోని పెద్ద మసీదు ప్రాంతాన్ని సీపీ అంజనీకుమార్, ఇతర అధికారులతో కలిసి సందర్శించారు. ఆర్ అండ్ బీ శాఖ సహకారంతో ఆ ప్రాంతాల్లోకి బయటి వ్యక్తులు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్, డ్రోన్ ప్రక్రియతో ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనించనున్నట్లు సీపీ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కడుపున బిడ్డను మోస్తూ.. 142కి.మీ కాలినడక