త్వరలో రాష్ట్రంలో పలుచోట్ల జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలో వరంగల్, ఖమ్మం నగరపాలక సంస్థలు; సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ పురపాలక సంఘాలతోపాటు గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో ఏర్పడిన ఖాళీలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి.
షెడ్యూల్ రావాల్సి ఉంది. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో మాస్క్‌లు, శానిటైజర్లు, ఫేస్ షీల్డులు అందుబాటులో ఉంచాలని సూచించారు. దివ్యాంగులు, 80 ఏళ్లు పైబడిన వారు, కొవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి పోస్టల్ బ్యాలెట్‌కు అవకాశం కల్పించాలని కోరారు. విశాలమైన హాల్‌లో తొమ్మిది కంటే ఎక్కువ కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేయకూడదని అన్నారు. బ్యాలెట్ బాక్స్‌లను నిర్వహించే సిబ్బంది, బ్యాలెట్ పత్రాలను కలిపే సిబ్బంది విధిగా పీపీఈ కిట్లను ధరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇదీ చూడండి : రూ.44.8 లక్షల బంగారం స్వాధీనం