Covid Vaccination in TS: అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకునేలా కృషి చేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అధికారులకు సూచించారు. రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ నాలుగు కోట్ల మార్కు దాటడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కొవిడ్‌పై పోరులో ముందడుగు వేసిన వారందరికీ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని కోరారు.
సీఎం కేసీఆర్ ప్రోత్సాహం వల్లే: సీఎస్
CS Somesh Kumar on Vaccination: ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశంతోనే నాలుగు కోట్ల వ్యాక్సినేషన్ మార్కు చేరుకోవడం సాధ్యమైందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. అందరూ త్వరగా టీకా తీసుకోవడంతో పాటు వారి కుటుంబసభ్యులు కూడా టీకాలు తీసుకునేలా చూడాలని సీఎస్ కోరారు. వ్యాక్సినేషన్ ప్రక్రియకు కృషి చేసిన ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు, వైద్యాధికారులు, సిబ్బంది సేవలను ఆయన కొనియాడారు. పురపాలక, పంచాయతీరాజ్ శాఖల మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రోత్సాహంతో పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సీఎస్ సూచించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో జిల్లా కలెక్టర్ల సమన్వయం అత్యంత కీలకమని పేర్కొన్నారు. నెల రోజుల్లోపు మరో కోటి టీకాల లక్ష్యాన్ని చేరుకుంటామని సీఎస్ సోమేశ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.