కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతమైందని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు ఆనందం వ్యక్తం చేశారు. వైరస్‌పై పోరాటంలో సీఎం ముందుండి నడిపించారని కొనియాడారు. కొవిడ్ వ్యాక్సిన్ సరఫరా చేసిన కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. కొవిన్ యాప్‌లో సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించారని వెల్లడించారు.
వ్యాక్సినేషన్ కోసం 2 నెలలుగా వైద్యారోగ్యశాఖ సిబ్బంది శ్రమించారన్న డీహెచ్... రాష్ట్రంలో వ్యాక్సికేషన్ కార్యక్రమాన్ని ఆన్‌లైన్ ద్వారా ప్రధాని ప్రారంభించారని వివరించారు. నిమ్స్‌లో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో గవర్నర్, గాంధీ ఆస్పత్రిలో మంత్రి ఈటల, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, నార్సింగి కేంద్రంలో మంత్రి సబిత పాల్గొన్నారని పేర్కొన్నారు. జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. తిలక్‌నగర్‌లో మంత్రి కేటీఆర్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారని స్పష్టం చేశారు.
వ్యాక్సిన్ తీసుకున్న ఆరోగ్యకార్యకర్తలు సురక్షితమని రుజువు చేశారు. 140 కేంద్రాల్లో 3,530 మందికి కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చాం. వ్యాక్సినేషన్‌లో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తలేదు. 20 మందిలో మైనర్ రియాక్షన్లు వచ్చాయి. టీకా తీసుకున్న చోట ఎర్రగా మారడం, దద్దుర్లు వచ్చాయి.
-- శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకులు
వ్యాక్సిన్ తీసుకున్న వారి ఆరోగ్యాన్ని కొన్ని రోజులు పర్యవేక్షిస్తామన్న ఆయన... టీకా తీసుకున్న 42 రోజుల తర్వాతే వైరస్ నుంచి రక్షణ వ్యవస్థ వృద్ధిచెందుతుందని స్పష్టం చేశారు. మొదటి డోస్ తీసుకున్న కేంద్రంలోనే రెండో డోస్ తీసుకోవాలని సూచించారు.
వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా కొవిడ్ నిబంధనలు పాటించాలి. కొందరు హెల్త్ కేర్ వర్కర్స్ వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రాలేదు. వ్యాక్సిన్ తీసుకోని హెల్త్ కేర్ వర్కర్స్‌కు అవగాహన కల్పిస్తున్నాం. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో త్వరలో వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తాం. మున్ముందు ప్రతి కేంద్రంలో వంద మందికి వ్యాక్సిన్ ఇచ్చేలా ఏర్పాట్లు. 104కు ఫోన్ చేసి టీకాపై సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
-- శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకులు
ఇదీ చూడండి: జీహెచ్ఎంసీ గెజిట్ నోటిఫికేషన్ జారీ.. మేయర్ ఎన్నికే తరువాయి!