కొవిడ్‌కు టీకాను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో శనివారం... రెండు జిల్లాల్లో డ్రైరన్ నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో నాలుగుచోట్ల, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మూడుచోట్ల టీకా సన్నద్ధత ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో చేపట్టనున్నారు.
ఈ ఆసుపత్రుల్లో...
హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి, నాంపల్లి ఏరియా ఆసుపత్రి, తిలక్‌నగర్ యూపీహెచ్సీ, సోమాజీగూడ యశోద ఆసుపత్రుల్లో డ్రైరన్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్వేత మహంతి తెలిపారు. మహబూబ్‌నగర్‌లో జిల్లాలో ప్రభుత్వాసుపత్రి, జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నేహా సన్‌షైన్ ప్రైవేటు ఆసుపత్రిలో వ్యాక్సినేషన్‌పై డ్రైరన్ కొనసాగనుంది.
పర్యవేక్షిస్తారు
సుమారు వందమంది టీకా లబ్ధిదారుల్లో కొందరు వైద్యసిబ్బంది, మరికొందరు సాధారణ పౌరులు ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు. టీకా లబ్ధిదారులను కేంద్రానికి వచ్చేలా సమీకరించడం, కొవిడ్ నిబంధనలను పాటిస్తూ వరుసల్లో నిలబెట్టడం, వారి సమాచారాన్ని కొవిన్ యాప్‌లో నమోదు చేయడం... తదితర అన్ని దశలను డ్రైరన్‌లో పరిశీలించనున్నారు. నేరుగా టీకా ఇవ్వడం తప్ప.. మిగిలిన అన్ని ప్రక్రియలను పర్యవేక్షిస్తారు. ఏ దశలోనైనా లోటుపాట్లు ఎదురైతే ప్రత్యేక పుస్తకంలో పొందుపరుస్తారు.
కేంద్రానికి నివేదిక
డ్రైరన్ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి సవివరంగా నివేదిస్తారు. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే నివేదికల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం కొవిడ్ టీకా పంపిణీలో అవసరమైన మార్పులు చేయనున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. వ్యాక్సినేషన్‌లో లోటుపాట్లు తెలుసుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణాజిల్లాతో పాటు పంజాబ్, అసోం, గుజరాత్‌లో డిసెంబర్ 28, 29 తేదీల్లో కేంద్రం డ్రైరన్ నిర్వహించింది.
ఇదీ చదవండి : రోజూ 10లక్షల మందికి టీకా ఇచ్చేందుకు సిద్ధం : ఈటల