అంతర్రాష్ట్ర జలవివాదాల(Interstate Water Disputes)పై ప్రత్యేక ట్రైబ్యునళ్లు ఉన్నప్పుడు.. కోర్టులు ఎలా జోక్యం చేసుకుంటాయో తెలపాలని ఉన్నత న్యాయస్థానం (Highcourt) పేర్కొంది. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి వివాదం పిటిషన్పై విచారణ అర్హతను వివరించాలని ఏపీ కృష్ణా జిల్లా (Krishna District Farmers) రైతుల తరఫు న్యాయవాదిని ఆదేశించింది. రాజోలిబండ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేసి పిటిషన్ విచారణ అర్హతపై రేపు వాదనలు వినిపించాలని పిటిషనర్లతో పాటు తెలంగాణ, ఏపీ, కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులను ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఎదుట ఉంచాలన్న తెలంగాణ ఏజీ అభ్యర్థనపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఏజీ తీరు బెంచ్ హంటింగేనని జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ధర్మాసనం వ్యాఖ్యానించింది.
జీవో 34పై సవాల్...
కృష్ణా నది ప్రాజెక్టుల్లో వంద శాతం విద్యుత్ ఉత్పత్తి చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ జీవో 34ని సవాల్ చేస్తూ ఏపీ కృష్ణా జిల్లా రైతులు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది. పునర్విభజన చట్టానికి విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) వ్యవహరిస్తోందని కృష్ణా జిల్లా రైతులు జి.శివరామకృష్ణ ప్రసాద్, ఎం.వెంకటప్పయ్య నిన్న హౌజ్ మోషన్ విచారణకు అనుమతి కోరగా.. హైకోర్టు తోసిపుచ్చింది.
అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరుతూ ఇవాళ దాఖలు చేసిన లంచ్ మోషన్ను విచారణకు స్వీకరించింది. విచారణ ప్రారంభించే ముందు పిటిషన్పై సీజే ధర్మాసనం విచారణ చేపడతుందా... తాము చేపట్టాలా స్పష్టత తీసుకుంటామని జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ టి.వినోద్ కుమార్ ధర్మాసనం పేర్కొంది. కొద్దిసేపటికి తమనే విచారణ చేపట్టాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి ఆదేశించారని జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ధర్మాసనం తెలిపింది.
హంటింగ్లాంటిదే...
పిటిషన్ విచారణ నుంచి తప్పుకొని సీజే ధర్మాసనం ముందుంచాలని తెలంగాణ ఏజీ బీఎస్ ప్రసాద్ కోరారు. తమను విచారణ చేపట్టాలని సీజే ఇప్పటికే స్పష్టం చేశారని మళ్లీ కోరాల్సిన అవసరం ఏముంటుందని జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ధర్మాసనం పేర్కొంది. తమ ధర్మాసనం ఎందుకు విచారణ చేపట్టరాదో తెలపాలని ఏజీని ప్రశ్నించింది. ఏజీ స్థాయి అధికారి అసమంజసంగా కోరడం సహేతుకం కాదని అసహనం వ్యక్తం చేసింది. ఏజీ తీరు బెంచ్ హంటింగ్ వంటిదేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
కోర్టులు ఎలా...
కృష్ణా ట్రైబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వినియోగిస్తోందని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకట రమణ వాదించారు. అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టంలోని సెక్షన్ 11 ప్రకారం.. హైకోర్టులు కానీ.. సుప్రీంకోర్టులు ఎలా జోక్యం చేసుకోగలవని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ధర్మాసనం అడిగింది. ప్రత్యేక ట్రైబ్యునళ్లు ఉన్నప్పుడు నేరుగా కోర్టులు ఎలా జోక్యం చేసుకోవచ్చునని ప్రశ్నించింది.
రాజోలిబండ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పిటిషన్ విచారణ అర్హతను వివరించాలని తెలిపింది. తెలంగాణ అదనపు ఏజీ రామచంద్రరావు జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించగా.. అడ్వొకేట్ జనరల్ వాదిస్తున్నప్పుడు అదే కేసులో అదనపు ఏజీ కూడా వాదించడం సరికాదని ధర్మాసనం వారించింది. సుప్రీంకోర్టు తీర్పు, అంతర్రాష్ట్ర జల వివాద చట్టంలోని సెక్షన్ 11ను అధ్యయనం చేయాలని పిటిషనర్లతో పాటు కేంద్రం, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు, కేఆర్ఎంబీ న్యాయవాదులను ఆదేశిస్తూ విచారణను రేపటికి వాయిదా వేసింది.